Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 70 లక్షల మంది బలి
- గాలినాణ్యతను పెంచాలి: కొత్త మార్గదర్శకాల్లో డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : వాతావరణ మార్పులతో పాటు వాయు కాలుష్యం అనేది మానవాళికి అతిపెద్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటిగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) స్పష్టం చేసింది. దీని కారణంగా ప్రతి ఏటా 70 లక్షల మంది అకాల మరణం పొందుతున్నారని, గాలి నాణ్యతను పెంచడం ద్వారా పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయవచ్చని బుధవారం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. గాలి నాణ్యత అనేది జరగాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉందని డబ్యూహెచ్ఓ చెప్పింది. గాలి కాలుష్య ప్రభావాన్ని ధూమపానం, అనారోగ్య ఆహారంతో సమానంతో పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు స్కాంట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో సీఓపీ26 ప్రపంచ పర్యావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏటా 70 లక్షల మందిని పొట్టనబెట్టుకుంటున్న వాయు కాలుష్యం.. ఎన్నో కోట్ల మంది ఆరోగ్యవంతమైన జీవితాలపై ప్రభావం చూపుతోంది. పిల్లల్లో ఈ కాలుష్యం ఊపిరితిత్తుల ఎదుగుదలను, వాటి పనితీరును ప్రభావితం చేసి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను పెంచుతోంది అని ఆరోగ్య సంస్థ పేర్కొంది. గాలి నాణ్యతకు సంబంధించిన 2005 తర్వాత డబ్ల్యూహెచ్ఓ తొలిసారి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దాదాపు అన్ని గాలి నాణ్యత మార్గదర్శకాల స్థాయిలను కిందికి సర్దుబాటు చేశామని, కొత్త స్థాయిలను అధిగమించడం ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాలతో ముడిపడి ఉందని హెచ్చరించింది. వీటిని పాటించడం వలన లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేసింది.
2005లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన గాలి నాణ్యత మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్య నియంత్రణపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ 16 సంవత్సరాల్లో గతంతో పోల్చుకుంటే గాలి కాలుష్యం తక్కువగా ప్రభావం చూపిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లభించాయని డబ్ల్యూహెచ్ఒ పేర్కొంది. ఒక నిర్ధిష్ట ప్రాంతమో లేక దేశమో కాకుండా వాయు కాలుష్య బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా తగిన చర్యలు తీసుకోవాలన్న సమర్థనకు ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపింది. వాతావరణ మార్పులను నియంత్రించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని, తద్వారా ఆరోగ్యపరంగా భారీ లబ్ధి పొందవచ్చని డబ్ల్యుహెచ్ఒ క్లైమేట్ ఛేంజ్ చీఫ్ మరియా చీరా పేర్కొన్నారు. దీనిపై త్వరలో గ్లాస్గోలో జరిగే పర్యావరణ సదస్సులో డబ్ల్యూహెచ్ఓ నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.
కొత్త స్థాయిలో సిఫారసులు
డబ్ల్యూహెచ్ఓ తన నూనత మార్గదర్శకాల్లో ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌తో సహా ఆరు కాలుష్య కారకాలకు సంబంధించి తక్కువ గాలి నాణ్యత స్థాయిలను సిఫార్సు చేసింది. వార్షిక సరాసరి పిఎం2.5 లెవల్‌ను క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రోగ్రాముల నుంచి 5కు తగ్గించింది. అదేవిధంగా పీఎం10 పరిమితిని 20 మైక్రోగ్రాముల నుంచి 15కు తీసుకువచ్చింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం వాయు కాలుష్య స్థాయిని తగ్గిస్తే.. ప్రపంవ్యాప్తంగా పీఎం2.5 వలన సంభవించే మరణాల్లో దాదాపు 80 శాతం వరకు నివారించవచ్చని డబ్ల్చూహెచ్ఓ తెలిపింది.