Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైట్‌హౌస్‌లో ఇరువురు నేతలు సమావేశం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్‌లో ఇరువురు నేతలూ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోడీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే మొదటిసారి. అమెరికా పర్యటనలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘాన్ పరిణామాలపై ప్రధాని మోడీ చర్చించే అవకాశం ఉంది.
వీటితోపాటు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతోపాటు వాతావరణ మార్పులపైనా చర్చించే అవకాశముంది. భారత్, అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని భేటీకి ముందు జో బైడెన్ ఆకాంక్షించారు. కోవిడ్, వాతావరణ మార్పు సహా పలు సమస్యలపై కలిసి పనిచేస్తామన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం పనిచేస్తామంటూ భేటీకి ముందు ట్వీట్ చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ..అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. మొదటిరోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో మోడీ సమావేశమయ్యారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతోనూ ఆయన చర్చలు జరిపిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి జరగబోయే క్వాడ్ కూటమి సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.