Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అగ్రరాజ్యానికి వెళ్లిన భారత ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో భేటీ అయ్యారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని హారీస్ అన్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్‌లో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు అమెరికా అందించిన సాయానికిగాను మోడీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత్, అమెరికా సహజ భాగస్వాములనీ, ఒకే రకమైన విలువలు, భౌగోళిక రాజకీయ ఆసక్తి కలిగి ఉన్నామనీ, సమన్వయం, సహకారం పెంపొందించుకుంటామని మోడీ అన్నారు. ఈ భేటీ సందర్భంగా కమలా హారీస్‌ను భారత్‌కు రావాలని మోడీ ఆహ్వానించారు. కోవిడ్-19తో భారత్ తీవ్రంగా బాధపడుతున్న సమయంలో.. అక్కడి ప్రజలకు వ్యాక్సినేషన్ అందించడంలో తన బాధ్యతను అమెరికా నెరవేర్చడం గర్వంగా ఉందని కమలా హారీస్ అన్నారు. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా అందిస్తున్నట్టు ప్రధాని మోడీ చెప్పారని హారీస్ పేర్కొన్నారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్ర గురించి ''సుమోటో'గా స్వీకరించాలనీ, దేశంలో ఉగ్రవాద గ్రూపులు పని చేస్తున్నాయనీ, అమెరికా, భారత్ భద్రతలపై ఇస్లామాబాద్ ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. ఆప్గనిస్తాన్‌లోని పరిస్థితులు, ప్రజాస్వామ్యం, ఇండో-పసిఫిక్ ముప్పు వంటి ఉమ్మడి సమస్యలపై చర్చించుకున్నారు. కాగా, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో మోడీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో షింజో అబే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సుగాతో ప్రధాని మోడీ తొలి వ్యక్తిగత సమావేశం ఇదే కావడం విశేషం. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో కూడా భేటీ అయ్యారు. అంతకముందు అమెరికాలోని టాప్ కార్పొరేట్ సంస్థల సీఈఓలతో వేర్వేరుగా మోడీ భేటీ అయ్యారు. క్వాల్‌కోమ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ సీఈఓలతో చర్చించారు.