Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు
బెర్లిన్ : జర్మనీ ఎన్నికల్లో సోషల్ డెమోక్రాట్లు విజయం సాధించారు. ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలో 16ఏండ్ల కన్జర్వేటివ్‌ల పాలన ముగిసిన తర్వాత మొదటిసారిగా జరిగిన ఈ ఎన్నికల్లో వారు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. మధ్యే వామపక్ష (ఎస్పీడీ) సోషల్ డెమోక్రాట్లు 25.7శాతం ఓట్లను గెలుచుకున్నారు. మెర్కెల్కి చెందిన సీడీయూ-సీఎస్‌యూ(క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ, క్రిస్టియన్ సోషల్ యూనియన్ ఇన్ బవారియా) కన్జర్వేటివ్ బ్లాక్ 24.1శాతం ఓట్లు సంపాదించింది. గ్రీన్స్‌కు 14.8శాతం రాగా, లిబరల్ ఫ్రీ డెమోక్రాట్స్ (ఎఫ్డీపీ)11.5శాతం ఓట్లు సంపాదించారు. ఎస్పీడీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో యూరప్‌లోని పలు ప్రాంతాల్లో సెంటర్ లెఫ్ట్ పార్టీలు కొంతమేరకు కోలుకున్నట్టు కనిపిస్తోంది. నార్వేకి చెందిన సెంటర్ లెఫ్ట్ ప్రతిపక్షం కూడా ఈ నెల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. సోషల్ డెమోక్రాట్స్కి చెందిన చాన్సలర్ అభ్యర్ధి ఒలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ, క్రిస్మస్లోగానే సంకీర్ణ కూటమి ఏర్పాటుకు ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే కన్జర్వేటివ్ ప్రత్యర్థి ఆర్మిన్ లాచెట్ మాట్లాడుతూ, రెండో స్థానంలో వున్నప్పటికీ తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సంకీర్ణ చర్చలు కొనసాగే కాలంలో మెర్కెల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు గానూ ఎస్పీడీ, గ్రీన్స్, ఎఫ్డీపీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు కన్జర్వేటివ్‌లతో కలిసే అవకాశం కూడా వుంది. ''ఎస్పీడీ మొదటి స్థానంలో వుంది. ఈ ఎన్నికల్లో మేం గెలిచాం.'' అని పార్టీ ప్రధాన కార్యదర్శి లార్స్ క్లింగ్బెయిల్ వ్యాఖ్యానించారు. స్కోల్జ్‌ను తదుపరి చాన్సలర్‌గా చేసేందుకు పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా గ్రీన్స్, ఎఫ్డీపీలతో మాట్లాడనున్నట్లు చెప్పారు. దీనిపై సోమవారం పార్టీ నాయకత్వం సమావేశమైంది. కూటమిని ఏర్పాటు చేయడంలో విజయం సాధించినట్లైతే స్కోల్జ్ నాల్గవ ఎస్పీడీ చాన్సలర్ అవుతారు. కానీ లాచెట్ తాను కూడా చాన్సలర్ అవుతాననే ఆశాభావంతో వున్నారు.