Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ పునరుజ్జీవనం దిశగా కీలక అడుగు
- చైనా శ్వేతపత్రం విడుదల
బీజింగ్ : అన్ని రంగాల్లో మౌలిక సంక్షేమాన్ని సాధించామని చైనా విడుదల చేసిన శ్వేత పత్రం తెలిపింది. ఈ దిశగా దేశ ప్రయాణాన్ని వివరిస్తూ, చైనా స్టేట్ కౌన్సిల్ సమాచార కార్యాలయం మంగళవారం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఆధునీకరణలో తమ అనుభవాలను పంచుకుంది. ''చైనాస్ ఎపిక్ జర్నీ ఫ్రమ్ పావర్టీ టు ప్రాస్పరిటీ'' పేరుతో ఈ శ్వేత పత్రాన్ని జారీ చేశారు. జులైలో ప్రకటించినట్లుగా, దేశ జాతీయ పునరుజ్జీవనం దిశగా ఇదొక కీలకమైన అడుగుగా పేర్కొంది. ప్రాథమికంగా, ఒక మోస్తరుగా సంక్షేమాన్ని సాధించడం వల్ల చైనా దేశం దీర్ఘకాలంగా కన్న కల సాకారమైందని ఆ శ్వేత పత్రం పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రజలు అవిశ్రాంతంగా చేసిన కఠోర శ్రమను ప్రశంసించింది. అందరికీ సర్వతోముఖాభివృద్ది సాధించడం ద్వారా సంపదను సృష్టించడంలో చైనా నెరవేర్చిన కర్తవ్యాలను సమీక్షించింది. సుస్థిరమైన రీతిలో ఆర్థికాభివృద్ధి జరగడం, ప్రజల ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం, సాంస్కృతిక రంగాన్ని పరిఢవిల్లేలా చేయడం, ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడం, పర్యావరణ హితానికి అనుగుణంగా గొప్ప మార్పులను తీసుకురావడమన్నది స్పష్టంగా కనపడుతోందని ఆ డాక్యుమెంట్ పేర్కొంది. ప్రతి ఒక్క వ్యక్తి సంక్షేమానికి హామీ కల్పించబడిందని తెలిపింది. గ్రామీణ, పట్టణాభివృద్ధి మిళితం చేయబడిందనీ, ప్రాంతాల వారీగా సమన్వయ అభివృధ్ధి జరిగిందని శ్వేత పత్రం పేర్కొంది. అన్ని రకాలుగా సంపద్వంతమైన సమాజాన్ని నిర్మించడమంటే అర్ధం అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో, ప్రజలందరూ దీన్నుండి లబ్ది పొందాలని జాతీయాభివృద్ధి, సంస్కరణల కమిషన్ (ఎన్డీఆర్సీ) అధికారి ఝావో చెన్క్సిన్ తెలిపారు. సమతూకంతో, సమన్వయంతో కూడిన సుస్థిరాభివృద్ధి అన్నింటికంటే ముఖ్యమని అన్నారు. తక్కువ ఆదాయం కలిగిన దేశం నుండి ఎగువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశంగా చారిత్రక పరివర్తన సాధిస్తూనే, చైనా లక్ష్యిత వ్యూహాన్ని అనుసరించింది. 2020 చివరి నాటికి దారిద్య్రం నుండి బయటపడే నిరుపేదలైన గ్రామీణ పేదలు దాదాపు 10కోట్ల మందికి సాయపడింది. గ్రామీణ, పట్టణ ప్రజల తలసరి ఆదాయానికి మధ్య నిష్పత్తి 2008 నుండి గత 13 సంవత్సరాలుగా నిలకడగా క్షీణిస్తూ వచ్చిందని ఎన్డీఆర్సీ డిప్యూటీ హెడ్ నింగ్ తెలిపారు.