Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సడ్బరీ : కెనడాలో ఉత్తర ఓంటారియోలోని గనిలో యాంత్రిక సమస్య తలెత్తి ప్రవేశ మార్గం మూసుకుపోవడంతో భూగర్భంలో చిక్కుకుపోయిన 39మంది కార్మికులను అక్కడ నుండి తరలించే ఆపరేషన్ కొనసాగుతోంది. వారు అందులో చిక్కుకుని 24గంటలు దాటింది. సహాయక బృందం కార్మికులను చేరుకుందని మైనింగ్ కంపెనీ వాలె ఒక ప్రకటనలో తెలిపింది. కార్మికులందరూ గని లోపల 900-1200 మీటర్ల మధ్య దూరాల్లో వివిధ చోట్ల చిక్కుకుపోయారని ఎవరూ గాయపడలేదని తెలిపింది. బహుశా మరికొద్ది గంటల్లో అందరూ సురక్షితంగా చేరుకోవచ్చునని భావిస్తునట్లు తెలిపింది. కార్మికులకు ఆహారం, నీరు, మందులు అందచేశామని కంపెనీ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం స్కూప్ బకెట్‌ను పంపినపుడు యాంత్రిక సమస్య తలెత్తి కార్మికులను పైకి కిందకు తీసుకెళ్ళే కన్వేయన్స్ వ్యవస్థ నిలిచిపోయిందని దాంతో కార్మికులను పైకి తీసుకురాలేకపోయినట్లు కంపెనీ వివరించింది. సహాయక బృందం తోడ్పాటుతో కార్మికులందరినీ సెకండరీ నిచ్చెన వ్యవస్థ ద్వారా పైకి తీసుకురానున్నట్లు తెలిపింది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మొత్తంగా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.