Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సైనిక ఉన్నతాధికారి మార్క్ మిల్లే
వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా చేసిన యుద్ధం ఒక వ్యూహత్మక వైఫల్యమని ఆ దేశానికి చెందిన సైనిక ఉన్నతాధికారి మార్క్ మిల్లే పేర్కొన్నారు. ఆఫ్ఘన్లో తిరిగి తాలిబన్లు అధికారంలోకి రావడం, అక్కడి నుంచి అమెరికా బలగాలు వెనక్కు రావడం ఈ వైఫల్యంలో భాగమని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లే అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సెనేట్ సాయుధ సేవల కమిటీ విచారణకు హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సుదీర్ఘకాల యుద్ధం ముగిసిన తర్వాత మొదటిసారిగా మిల్లేతో పాటు రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్, యుఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నేత్ మెకంజీ కాంగ్రెస్ ముందు హాజరై సాక్ష్యమిచ్చారు. '' ఆఫ్ఘన్లో మనం కోరుకున్న విధంగా యుద్ధం ముగియలేదన్నది స్పష్టం. ఇప్పుడు తాలిబన్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అధికారం చేపట్టారు'' అని మిల్లే కమిటీకి తెలిపారు. ఆఫ్ఘన్‌పై యుద్ధంలో వ్యూహాత్యక అపజయం పాలయ్యామని, ప్రస్తుతం అక్కడ శత్రువులు పాలన చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా 2,500 సైనికుల మేర ఉంచి ఉండాల్సింది అని, బలగాలను వేగంగా ఉపసంహరించుకోవడం వలన ఆ దేశంలో ప్రభుత్వం, సైనిక వ్యవస్థ కుప్పకూలిందని మిల్లే, మెకంజీ పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు గతనెలలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బెడెన్ చెప్పినదానికి విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఉపసంహరణ గడువు తర్వాత కూడా కొంత బలగాలను ఉంచాలని ఏ సైనిక అధికారి కూడా తనకు సలహా ఇవ్వలేదని ఆయన ఆ సమయంలో పేర్కొన్నారు. ఆఫ్ఘన్లో మిలటరీ పతనం తమ అంచనాలకు మించి ఉందని మిల్లే, పెంటగాన్ చీఫ్ ఆస్టిన్ కమిటీ ముందు నొక్కిచెప్పారు. తమతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలు శిక్షణ ఇచ్చిన ఆఫ్ఘన్ సైన్యం పోరాడకుండానే ఉండిపోవడం ఆశ్చర్యపరిచిందని ఆస్టిన్ అన్నారు. ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లకు చాలా సమయం పట్టొచ్చనే నిఘావర్గాల అంచనాలు కూడా తలకిందులయ్యాయని మిల్లే పేర్కొన్నారు. ఆఫ్ఘన్లో బలగాల ఉపసంహరణ అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసిందని మిల్లే ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పెరిగే అవకాశం ఉందని అన్నారు.