Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి స్థానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2012 ఎన్నికల ప్రచారానికి సంబంధించి అక్రమ ఫైనాన్సింగ్ ఆరోపణలపై దాఖలైన కేసులో ఆయన దోషి తేలారు. ఇంటిలోనే ఏడాది పాలు జైలుశిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. దీంతో జైలుకు వెళ్లకుండానే నికోలస్ తన జైలు శిక్షను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే అతను ఎలక్ట్రానిక్ పర్యవేక్షణతో కూడిన ఒక బ్రాస్లెట్ ధరించాలని న్యాయస్థానం ఆదేశించింది. నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికీ దేశంలోని కంజర్వేటివ్ సర్కిల్స్‌లో బలమైన ప్రభావం ఉన్న సర్కోజీ కోర్టు విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. తాజా తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునే చట్టపరమైన అవకాశం ఈ మాజీ అధ్యక్షుడికి ఉంది. తాను ఏ తప్పు చేయలేదని సర్కోజీ ఇంతకుముందు తనపై ఆరోపణలను ఖండించారు. 2012 ఎన్నికల సమయంలో తన ప్రచారానికి సంబంధించి లాజిస్టిక్స్ లేదా నిధుల కేటాయింపు చేయడంలో తన పాత్ర లేదని జూన్‌లో కోర్టుకు తెలిపారు. ఫ్రెంచ్ ఎన్నికల చట్టం ప్రకారం అనుమతించబడిన దాదాపు 22.5 మిలియన్ పౌండ్లకు రెండింతలు ఖర్చు చేసి, దానిని దాచేందుకు సర్కోజీ ఒక స్నేహపూర్వక పీఆర్ సంస్థను నియమించాడని ప్రాసిక్యూటర్లు వాదించారు. అక్రమాల గురించి అభ్యర్థికి తెలుసుననీ, దీనికి సంబంధించి అకౌంటెంట్లు రెండు సందర్భాల్లో హెచ్చరించినా దాన్ని కొనసాగించేందుకూ మొగ్గు చూపారని పేర్కొన్నారు. సర్కోజీనే తన ప్రచార ఫైనాన్సింగ్‌కు బాధ్యత వహించే ఏకైక వ్యక్తి అని స్పష్టం చేశారు.