Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబాపై ఆంక్షలను ఖండించిన సిరియా
- ఉపసంహరించుకోవాలని ఐరాస వేదికగా డిమాండ్
డమాస్కస్ : క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్యపరమైన ఆంక్షలను సిరియా తీవ్రంగా ఖండించింది. క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకుంటున్న చర్యలు ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని, వెంటనే ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిరియా విదేశాంగ శాఖ మంత్రి ఫైసల్ అల్ మెక్దాద్ ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా క్యూబాతో పాటు వెనిజులా, బెలారస్, ఇరాన్, నికరుగ్వా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీఆర్కే)కు సంఘీభావం ప్రకటించారు. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి మెక్దాద్ తాజాగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పైన పేర్కొన్న దేశాలకు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న ఆర్థికపరమైన ఉగ్రవాద చర్యలను తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభాన్ని ఉపయోగించుకొని కొన్ని శక్తులు ఇతర దేశాల్లో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించడం దారుణమనీ, అవి చెత్త చర్యలు అని తీవ్రంగా విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘన, ఇతర విధమైన ఆరోపణలతో విధించిన ఆంక్షలు సిరియా, క్యూబా, ఇరాన్, సూడాన్, వెనిజులా, యెమెన్, వంటి దేశాలను తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నాయని అన్నారు. ఇక్కడ వాస్తవమేమిటంటే, ఈ ఆంక్షల ద్వారా ఆయా దేశాల్లోని ప్రనజల ఆహారం, వైద్యం వంటి ప్రాథమిక హక్కులు, జీవించే హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా తన క్రిమినల్ పాలసీలో భాగంగా ఆర్థిక దిగ్బంధనం, ఇతర ఆంక్షలు కొనసాగిస్తోందనీ.. వాటి విపత్కర ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ చర్యలను ఎత్తివేయడం లేదా సడలించడం కోసం ఐక్యరాజ్యసమితితో సహా ఇతర మానవతా సంస్థలు ఇచ్చిన పిలుపును కూడా పట్టించుకోకపోవడాన్ని మెక్దాద్ తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాన్ని పరిరక్షించేందుకు, భద్రత, స్థిరత్వానికి హామీ ఇవ్వడానికి, ప్రపంచాభివృద్ధి సాధించడానికి, కొన్ని దేశాల ఆధిపత్యంతో పాటు విదేశీ జోక్య విధానాలను నియంత్రించేందుకు చైనా, రష్యాల విధానానికి తమ దేశం మద్దతు ఇస్తుందని చెప్పారు.