Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రభుత్వ వ్యయ కార్యకలాపాలేవీ నిలిచిపోకుండా వుండేందుకు గానూ చివరి నిముషంలో అమెరికా సెనెట్ బిల్లును ఆమోదించింది. డిసెంబరు 3 వరకు ప్రభుత్వానికి అవసరమైన చెల్లింపులు జరిగేందుకు వీలుగా తాత్కాలికంగా నిధులు అందచేసే చర్య చేపట్టింది. ఈ బిల్లును 65-35 మెజారిటీతో ఆమోదించారు. ప్రభుత్వం కుప్పకూలకుండా వుండేందుకు గానూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు బుధవారం అత్యవసరంగా ఒక అంగీకారానికి వచ్చారు. పెరుగుతున్న రుణ పరిమితిపై ఈ వారం ప్రారంభంలో అమెరికన్ కాంగ్రెస్‌లో చర్చ జరిగి, సభ స్తంభించింది. అనంతరం బుధవారం అత్యవసర ప్రాతిపదికన అంగీకారం కుదిరింది. ఈ తీర్మానం ఆమోదాన్ని రిపబ్లికన్ల విజయంగా సెనెట్ మైనారిటీ నేత మిచ్ మెకానెల్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలో రుణ పరిమితి పెంపు నిబంధనను చేర్చనందున ఇది తమ విజయమేని వారు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఖర్చులు, చెల్లింపులు గురువారం అర్ధరాత్రితో నిలిచిపోనున్నాయి. ఈ ప్రతిష్టంభన వల్ల ఫెడరల్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు ఇతరత్రా అన్నీ ఆగిపోతాయి. ప్రభుత్వ సేవలు, సామాజిక మద్దతు అంతా నిలిచిపోతుంది. ఈ షట్‌డౌన్‌ను నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి హామీ ఇచ్చారు. సెనెట్ బిల్లును ఆమోదించిన వెంటనే అధ్యక్షుని సంతకం నిమిత్తం పంపించారు. రుణ పరిమితిని పెంచే చర్యలు సభ్యులు తీసుకోని పక్షంలో అక్టోబరు 18నాటికి ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభిస్తాయని ఈ వారం ప్రారంభంలో ఆర్థిక శాఖ మంత్రి జానెత్ యెలెన్ హెచ్చరించారు.