Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : వచ్చే ఏడాది జరగనున్న ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే కుమార్తె సారా డ్యూటర్టే కార్పియో పోటీచేసే అవకాశం ఉందని ఎబిఎస్-సిబిఎన్ అనే మీడియా సంస్థ పేర్కొంది. రోడ్రిగో సుదీర్ఘకాల సహచరుడు, ఉపాధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్లు ప్రకటించిన సెనెటర్ బాంగ్గో ఆమె రన్మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్థి)గా ఉంటారని తెలిపింది. సారా కార్పియో ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో మూడో అతిపెద్ద నగరమైన దావో మేయర్గా ఉన్నారు. మేయర్గా కొనసాగేందుకు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనని కూడా అంతకుముందు చెప్పారు. వచ్చే ఏడాది తాను రాజకీయాల నుంచి రిటైర్ కానున్నట్లు రోడ్రిగో శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష పదవికి పోటీచేయాలని అంతకుముందు భావించినా, కొన్ని ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. దీని తర్వాత రోడ్రిగో ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఎబిఎస్-సిబిఎన్ న్యూస్ ఈ కథనాన్ని నివేదించింది. దీనిపై సారా కార్పియో అధికార ప్రతినిధి క్రిస్టియానా గార్సియాను రాయిటర్స్ ప్రతినిధి వివరణ కోరగా '' స్థానిక మీడియాలో వచ్చిన కథనాలను గురించి మాకు తెలిసింది. అయితే దీనిపై ఇప్పుడు స్పందించలేము'' అని పేర్కోన్నారు.