Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు సమాచారం ప్రజల్ని చంపేస్తోంది
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
జెనీవా: కరోనా ప్రభావం ఇంకా తగ్గిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారనీ, కానీ దాన్నుంచి ఇంకా బయటపడలేదని పేర్కొంది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకిందనీ, 54 వేల మరణాల సంభవించాయని వెల్లడించింది. వాస్తవంగా ఆ లెక్కలు మరింత ఎక్కువగా ఉండే అవకాశంముందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 'కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది. మనకు వైరస్‌పై నియంత్రణ రాలేదు కాబట్టే.. ఈ ముప్పు కొనసాగుతోంది. మహమ్మారికి చరమగీతం పాడేందుకు మనవద్ద ఉన్న సాధనాలను సరిగా వినియోగించుకోవడంలేదు. కొన్ని ప్రాంతాల్లో ఐసీయూలు, ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిపోయిందని నటిస్తూ.. నిబంధనలు పాటించకుండా తిరిగేస్తున్నారు' అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దాదాపు రెండేండ్ల కాలంలో సుమారు 50 లక్షల మందిని కరోనా బలిగొంది. కరోనా టీకా తీసుకోని వ్యక్తుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాల రేటు.. టీకా తీసుకోని వారిలోనే ఎక్కువగా ఉందని పేర్కొంది. కరోనా వైరస్, టీకా గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న తప్పుడు సమాచారం తీవ్ర ప్రభావం చూపుతోందని అసహనం వ్యక్తం చేసింది. అది ప్రజల మరణాలకు కారణమవుతోందనీ, దీని కారణంగా అంతర్జాతీయ సమాజం వైరస్‌పై వీలైనంత ఎదురుదాడి చేయలేకపోతున్నదని తెలిపింది.