Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఫెడరల్ ప్రభుత్వ రుణ పరిమితిని పెంచడంలో అమెరికా కాంగ్రెస్ విఫలమైతే ప్రపంచం మరింతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశముందని వైట్‌హౌస్ ఆర్థికవేత్తలు హెచ్చరించారు. జాతీయ రుణాలను అమెరికా ప్రభుత్వం చెల్లించగలిగేస్థితిలో లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ''రుణాలు చెల్లించలేకపోవడం వల్ల తీవ్రమైన, సుదీర్ఘమైన ఆర్థిక, ద్రవ్య ప్రభావాలు వుంటాయి. అమెరికాలో ఆర్థిక మార్కెట్లు విశ్వాసం కోల్పోతాయి. డాలరు బలహీనపడుతుంది. స్టాక్ మార్టెట్లు కుప్పకూలతాయి.'' అని సిసీలియా రౌజ్ నేతృత్వంలోని వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారుల మండలి పేర్కొంది. 'అమెరికా క్రెడిట్ రేటింగ్ దాదాపు క్షీణించింది. అనేక వినియోగదారుల రుణాలకు వడ్డీ రేట్లు అధికంగా పెరుగుతాయి.' అని వారు పేర్కొన్నారు. వీటి పర్యవసానాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం మరింత ముదురుతుందని అన్నారు. ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుందన్నారు. వెంటనే పరిష్కరించలేకపోతే అమెరికా చెల్లింపుల సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుందని అన్నారు.
చెల్లింపుల సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లకు బలమైన సంకేతాలు పంపుతుంది. ప్రపంచవ్యాప్తంగా పరపతి మార్కెట్లు స్తంభించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులను తొలగించడం కూడా ఎక్కువైపోతుందని వారు పేర్కొన్నారు. 2008లో అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఇప్పటికీ వెన్నాడుతోంది.