Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచంలో సగం మందికి డయాగస్టిక్ సేవల్లేవ్
- సరైన చికిత్స అందడం లేదు.. కొరతలో ఉన్న వైద్య వనరులు వృథా : ది లాన్సెట్ కమిషన్ ఆన్ డయాగస్టిక్స్ వెల్లడి
వాషింగ్టన్: ఏ దేశంలోనైనా సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ మెరుగైన ఫలితాలు రాబట్టడానికి ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో పాథాలజీ మరియు లాబోరేటరీ డయాగస్టిక్స్, డయాగస్టిక్ ఇమేజింగ్ల పాత్ర కీలకమైనవి. ఎందుకంటే రోగ నిర్ధారణ జరిగేది ఇక్కడే కాబట్టి. అయితే, ప్రపంచవ్యాప్తంగా జనాభాలో దాదాపు సగం మందికి మధుమేహం, రక్తపోటు, హెచ్ఐవీ, క్షయ వంటి అనేక సాధారణ వ్యాధులకు ప్రాథమిక రోగనిర్ధారణలు అందుబాటులో లేవని 'ది లాన్సెట్ కమిషన్ ఆన్ డయగ్నాస్టిక్స్' నేతృత్వంలోని విశ్లేషణ అధ్యయనం బృందం పేర్కొంది. దీని కారణంగా రోగ నిర్ధారణ లేకుండానే వైద్యం పొందుతున్నారు. లాన్సెట్ కమిషన్‌లో 16 దేశాలకు చెందిన 25 మంది నిపుణులు ఉన్నారు. ప్రజలు ఖచ్చితమైన, అధిక నాణ్యత, సరసమైన రోగనిర్ధారణలు లభించడం లేదనే విషయాన్ని గుర్తించామని పరిశోధకులు తెలిపారు. నాణ్యతతో కచ్చితమైన రోగ నిర్ధారణ పొందలేని కారణంగా వారికి తక్కువ చికిత్స అందడం లేదా అసలు చికిత్సనే అందకపోవచ్చునని వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో రోగ నిర్ధారణ ఆవశ్యకతను నిపుణుల బృందం నొక్కి చెప్పింది. రోగ నిర్ధారణ గ్యాప్‌ను పూరించడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించింది. అధిక ఆదాయ దేశాలను మించిన స్థాయిలో రోగనిర్ధారణకు మెరుగైన చర్యలను విస్తరించాల్సిన అవసరముందనీ, ఈ మేరకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు ప్రారంభించాలని తెలిపింది. ఇటీవల వెలుగుచూసి.. ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి రోగని ర్ధారణ విషయంలో ప్రపంచ దేశాలకు ఓ గుణపాటం నేర్పిందని నిపునుల బృందం పేర్కొంది. అధిక ఆదాయ దేశాల్లో ప్రయివేటు సెక్టారుతో పాటు పబ్లిక్ సెక్టారులోనూ రోగ నిర్ధారణ లాబోరేటరీలను ఉపయోగించగల సామ ర్థ్యంతో పాటు పరీక్షా సామర్థ్యాన్ని పెంచడం కీలకమని పేర్కొంది. అయితే, ఇప్పటికీ తక్కువ-మధ్య ఆదాయంతో ఉన్న చాలా దేశాలు రోగనిర్ధారణ విషయాల్లో ప్రతికూలంగా ముందుకుసాగుతున్నాయి. అక్కడ రోగ నిర్ధారణ సామర్థ్యం అంతంతమాత్రమేనని లాన్సెట్ నిపుణుల కమిషన్ తెలిపింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందుబాటులో లేకుండానే వ్యాధులకు చికిత్స పొందుతున్నారు అని ఆక్స్ఫర్డ్ వర్సీటీకి చెందిన కెన్నెత్ ఫ్లెమింగ్ అన్నారు. 'ఇది గుడ్డిగా వైద్యం అందించడం లాంటిది. ఇది రోగులకు హానికరము మాత్రేమ కాకుండా కొరతలో ఉన్న వైద్య వనరు లను సైతం గణనీయంగా వృధా చేస్తుంది' అని ఫ్లెమింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్త జనాభాలో దాదాపు సగం మందికి (47 శాతం) రోగనిర్ధారణకు ప్రాప్యత లేదని లాన్సెట్ నిపుణుల కమిషన్ అంచనా వేసింది. ప్రాథమిక సంరక్షణలో రోగనిర్ధారణ అంతరం ఎక్కువగా ఉంది. తక్కువ, తక్కువ-మధ్య ఆదాయ దేశాలలో కేవలం 19శాతం జనాభా మాత్రమే సరళమైన రోగనిర్ధారణ పరీక్షలను పొందగల్గుతున్నారు.