Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
- నాలుగు డోసులుగా పిల్లలకు వేయాలంటూ సూచన
జెనీవా: మలేరియా ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా కొన్ని కోట్ల మందిని అనారోగ్యానికి గురిచేస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 2019లో 22.9 కోట్ల మంది మలేరియా బారినపడ్డారు. 4.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో అత్యధికం 67 శాతం మంది (2.74 లక్షలు) ఐదేండ్లలోపు చిన్నారులే కావడం కలచివేసే అంశం. అయితే, ఇప్పటివరకు మందుల ద్వారా మలేరియాకు చికిత్స అందిస్తుండగా... తాజాగా ప్రపంచంలోనే మొదటిసారి మలేరియాకు టీకా అందుబాటులోకి వచ్చింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఈ టీకాకు ఆమోదం తెలిపింది. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించడంతో టీకాకు ఆమోదం తెలిపినట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 'ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01' (మాస్క్విరిక్స్) అనే వ్యాక్సిన్‌ను ప్రపంచమంతా వినియోగించేందుకు డబ్ల్యూహెచ్‌వో పరిశోధన, వైద్య అధ్యయన బృందాలు, నిపుణులు ఆమోదం తెలిపారని టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. నాలుగు డోసులుగా పిల్లలకు టీకా వేయాలని సూచించారు.కాగా, ఇప్పటివరకు 23 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను కెన్యా, ఘనా, మలావిల్లోని చిన్నారులకు ఇచ్చినట్టు చెప్పారు. వ్యాక్సిన్ 30 శాతం ప్రభావవంతంగా ఉందని టెడ్రోస్ చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో 90 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ ధర కూడా తక్కువేనని చెప్పారు. కాగా, ఈ వ్యాక్సిన్ కు పైలట్ ప్రోగ్రాం కింద డబ్ల్యూహెచ్‌వోకు చెందిన వ్యాక్సిన్ గ్రూప్ గావి ఆర్థిక సహకారం అందిస్తోంది.