Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాందహార్ : తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ మరోసారి ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఉత్తర ఆఫ్ఫన్లోని కుందుజ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 100మంది వరకు చనిపోగా..భారీ సంఖ్యలో గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఖాన్ అబాద్ ప్రాంతంలోని షియాల మసీదును లక్ష్యంగా చేసుకొని ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద శబ్దాలు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మారణకాండతో మసీదులో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు..రక్తంతో తడిసి ముద్దయింది. ఘటనాస్థలిలో క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది.దీనిపై తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ స్పందించారు. షియాల మసీదును లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వెల్లడించారు. అనేక మంది గాయాలపాలైనట్టు తెలిపారు. తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రదాడులు పెరుగుతున్నట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.