Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓస్లో: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఇద్దరు జర్నలిస్టులకు వరించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి పాత్రికేయులు మరియా రెసా(ఫిలప్పీన్స్), దిమిత్రి మురాటోవ్(రష్యా)లకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని కమిటీ ప్రశంసించింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెసా.. తమ దేశంలో నానాటికీ పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె 'రాప్లర్' పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఇక రష్యాకు చెందిన జర్నలిస్టు దిమిత్రి మురాటోవ్ మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక నొవాజా గజెటా వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 24 ఏండ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి తమ దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి.