Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : బడా బహుళజాతి కంపెనీలపై 15శాతం కనీస గ్లోబల్ టాక్స్ విధించేందుకు భారత్ సహా 136 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. పన్నులు ఎగ్గొట్టి భారీగా లాభాలు పోగేసుకునేందుకు బహుళజాతి కంపెనీలు పన్నులు లేని లేదా చాలా తక్కువ పన్ను ఉన్న దేశాల్లో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. తమ వ్యాపార లావాదేవీలు ఎక్కువగా సాగే, కస్టమర్లు అధికంగా ఉండే దేశాల్లో పన్ను కట్టకుండా ఊరుపేరు లేని దేశాల్లో కేంద్ర కార్యాలయాను ఏర్పాటు చేసుకునే బహుళజాతి కంపెనీలకు దీంతో చెక్ పెట్టినట్లవుతుంది. ఇప్పుడు ఏ దేశంలో బహుళజాతి కంపెనీలు ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నా 15 శాతం పన్ను కట్టాల్సిందే.. అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా బహుళ జాతి కంపెనీలకు తేలికపాటి రీతిలో పన్నులు విధించడం ద్వారా పెట్టుబడులను, ఉద్యోగాలను ఆకర్షించే ఉద్దేశంతో ఈ దేశాలు 15శాతం పరిమితిని ఏర్పాటు చేసుకున్నాయి. దీనితో ప్రమేయం వున్న 140దేశాల్లో 136 దేశాలు ఒప్పందానికి మద్దతునిచ్చాయి. పాకిస్తాన్, కెన్యా, నైజీరియా,శ్రీలంకలు గైర్హాజరయ్యాయి. పూర్వపు రీతిలో వున్న ఒప్పందానికీ కెన్యా, నైజీరియా, శ్రీలంకలు మద్దతివ్వలేదు. కాగా, పాకిస్తాన్ గైర్హాజరవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈ చర్చలకు హాజరైన అధికారి ఒకరు తెలిపారు. చివరి నిముషం వరకు భారత్ కూడా ఈ విషయంలో వెనుకాడింది. కానీ చివరికి ఒప్పందానికి మద్దతిచ్చిందని వారు చెప్పారు. నాలుగేళ్ళ నుండి దీనిపై చర్చలు కొనసాగుతూ వచ్చాయి.