Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక
- ఇతర దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని వ్యాఖ్య
దోహా : ఆఫ్ఘనిస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయొద్దని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలు చేయడం ఎవరికీ మంచిది కాదని అమెరికాకు స్పష్టం చేశామని ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి ముల్లా అమీర్‌ఖాన్ ముత్తాఖి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిన తర్వాత అమెరికా-తాలిబన్ల మధ్య చర్చలు ఖతార్ రాజధాని దోహాలో ప్రారంభమై విషయం తెలిసిందే. శనివారం నాటి చర్చల అనంతరం ముత్తాఖి ఆఫ్ఘన్ ప్రభుత్వ వార్తాసంస్థ భక్తర్తో మాట్లాడారు. 'ఆఫ్ఘనిస్తాన్‌తో మంచి సంబంధాలు ప్రతి ఒక్కరికీ మంచిదే. అయితే దేశంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయొద్దు. అది ప్రజల సమస్యలకు దారితీస్తుంది' అని పేర్కొన్నారు. రెండు రోజుల చర్చల్లో భాగంగా మొదటి రోజైన శనివారం అమెరికా విదేశాంగ ప్రత్యేక ప్రతినిధి టామ్ వెస్టు, యూఎస్ఏఐడీ హ్యూమానిటేరియన్ ఉన్నతాధికారి సారా చార్లెస్‌తో కూడిన బృందంతో చర్చల అనంతరం ముత్తాఖి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆఫ్ఘన్ ప్రజలు కరోనా వ్యాక్సినేషన్లో అమెరికా సహకరిస్తుందని ముత్తాఖి తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్, ఇతర మానవతా సహకారాన్ని అందించేందుకు అమెరికా బృందం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు దేశాలు ఒకరికొకరితో మంచి సంబంధాలతో పాటు సహనం కలిగివుటాయని హామీ ఇచ్చిందని అన్నారు. ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకు నిల్వలపై ఆంక్షలు ఎత్తేయాలని అమెరికాను కోరామని చెప్పారు.
సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ
అంతర్జాతీయంగా సహకారం నిలిచిపోవడం, ఆహార ధరలు, నిరుద్యోగం పెరుగుదలతో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బందులతో చర్చించేందుకు అమెరికాతో పాటు ఇతర దేశాలతో సమావేశాలు నిర్వహించాలని తాలిబన్లు కోరుకుంటున్నారని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ముత్తాఖి తెలిపారు. ఆర్థికంతో పాటు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కారమవుతాయని అన్నారు. ఆఫ్ఘన్ ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు, సేవలు అందించేందుకు తాము ఇతర దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని, అదేవిధంగా ఇతరులతో సహకరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.