Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సొమ్ము అక్రమ వినియోగంపై దర్యాప్తు
వియన్నా : ఆస్ట్రియా ఛాన్స్లర్ సెబాస్టియన్ కుర్జ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం ఒక టెలివిజన్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై తనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ నెలకొన్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో కుర్జ్ ఛాన్స్లర్ కుర్చీ నుంచి తప్పుకున్నారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో ఉన్నారని గతవారం ప్రాసిక్యూటర్ ప్రకటించిన నేపథ్యంలో కుర్జ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియాలో అనుకూల కవరేజీ కోసం జరిగిన ఒప్పందంలో ప్రభుత్వ సొమ్మును అక్రమంగా వినియోగించారని కుర్జ్తో పాటు తొమ్మిది మంది ఇతరులపై ఆరోపణలు ఉన్నాయి. తన సన్నిహితుడు, ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న అలెగ్జాండర్ స్కాలెన్బర్గ్ను తదుపరి ఛాన్స్లర్గా కుర్జ్ ప్రతిపాదించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కుర్జ్ పదవి నుంచి దిగిపోవాలని మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. మంగళవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఎదురుర్కోనున్న కుర్జ్ అంతకుముందే రాజీనామా చేయడం గమనార్హం. కుర్జ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ '' ప్రస్తుతం మనకు కావాల్సింది స్థిరమైన పరిస్థితులు. కావున ఈ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు, గందరగోళ పరిస్థితులను నియంత్రించి స్థిరమైన మార్గం కల్పించాలని అనుకుంటున్నాను'' అని అన్నారు. నూతన ఛాన్స్లర్గా స్కాలెన్బర్గ్ను ప్రతిపాదించిన కుర్జ్.. తాను మాత్రం కంజర్వేటివ్ ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీ నేతగా, పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని తెలిపారు. ఛాన్స్లరీ, ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు పార్టీకి చెందిన పలు కార్యాలయాల్లో అధికారులు బుధవారం నాడున దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైస్ ఛాన్స్లర్, మిత్రపక్ష నేత వెర్నర్ కోగ్లేర్ శుక్రవారం మాట్లాడుతూ.. కుర్జ్ ఛాన్స్లర్ పదవి నుంచి తప్పించి మరో కొత్త వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు.