Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతంత్ర మీడియా ప్రాధాన్యతను గుర్తుచేసినందుకు నోబెల్ పురస్కారం
- రెస్సా, మురాతోవ్ సేవలపై సర్వత్రా హర్షం
- మీడియాతోనే బలమైన ప్రజాస్వామ్యం : ఎంపిక కమిటీ చైర్మెన్ బెరిట్ అండర్సన్
ఓస్లో : నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు జరుగుతున్న దేశాల్లో భావ వ్యక్తీకరణ కోసం, ప్రజాస్వామ్యం కోసం శ్రమించిన ఇద్దరు జర్నలిస్టులు మరియా రెస్సా(ఫిలిప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)లను 'నోబెల్ శాంతి పురస్కారం' వరించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడినందువల్లే జర్నలిస్టులకు పురస్కారం దక్కిందని సమాచారం. భావవ్యక్తీకరణ, ప్రజాస్వామ్యం పెంపొందించటంలో స్వతంత్ర మీడియా పాత్రను అందరికీ తెలియజేయటం కోసమే ఎంపిక కమిటీ ఇద్దరు జర్నలిస్టులను ఎంచుకుందని తెలుస్తోంది. నోబెల్ శాంతి పురస్కారంతో ఆయా దేశాల్లో స్వతంత్ర మీడియాకు మరింత ప్రాధాన్యత పెరిగింది. పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడ్డ మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్లకు పురస్కారం అందజేస్తున్నామని ఎంపిక కమిటీ కొనియాడింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మెన్ బెరిట్ రెయిస్ అండర్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..''ప్రపంచ జర్నలిస్టులకు రెస్సా, మురాతోవ్ ప్రతినిధులు. ప్రస్తుత ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి, పత్రికాస్వేచ్ఛకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. జర్నలిస్టులు, మీడియాలేకుండా బలమైన ప్రజాస్వామ్యం ఉండదు. పాలకుల వేధింపులు, బెదిరింపులను ఎదుర్కొని వారు నిలబడ్డారు. శాంతిని పెంపొందించాలంటే పత్రికాస్వేచ్ఛ చాలా ముఖ్యమైంది. పాలకుల అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టే స్వతంత్ర మీడియా సేవల్ని గుర్తించడానికి వీరిని పురస్కారానికి ఎంపికచేశా''మని అన్నారు.
రెస్సా పరిశోధనాత్మక జర్నలిజం
ఫిలిప్పీన్స్‌కు చెందిన మరియా రెస్సా, ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో పాలనపై అనేక విమర్శనాత్మక కథనాలు రాశారు.ఉదాహరణకు'యాంటి డ్రగ్' కార్యక్రమంతో డ్యూటె ర్టో ప్రభుత్వం మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేలాది మందిని అంతమొందించిన తీరును 'రాఫ్లార్' న్యూస్ వెబ్సైట్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. దాంతో ఆమెపై పగబట్టిన డ్యూటెర్టో ప్రభుత్వం రెస్సాపై ప్రయాణ ఆంక్షలు విధించింది.ఆమె నడుపుతున్న న్యూస్ వెబ్‌సైట్‌పై పలు లీగల్ కేసులు నమోదుచేసింది.ఈ కేసుల్లో వివిధ న్యాయమూర్తులను కలుసుకోవటం,పలు అనుమతులు కోరటంతోనే ఆమె సమయమంతా గడిచిపోయేది. ఓ వైపు ఇవన్నీ ఎదుర్కొంటూనే తన పరిశోధనాత్మక జర్నలిజాన్ని రెస్సా కొనసాగించారు.
బెదిరింపులకు లొంగని మురాతోవ్
రష్యాలో 1993లో ప్రారంభమైన 'నవోయా గజెటా' దినపత్రిక వ్యవస్థాపక ఎడిటర్లలో ఒకరు దిమిత్రి మురా తోవ్. స్వతంత్ర పత్రికగా 'నవోయా గజెటా' గుర్తింపు పొం దింది. వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధ తను చాటుకుంది. ప్రభుత్వ అవినీతి, హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ప్రభుత్వమోసాలు...మొదలైనవాటిపై సంచల నాత్మక కథనాలు ప్రచురించింది. ఈ సంస్థలో పనిచేసిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. మీడియా స్వేచ్ఛ కోసం మురాతోవ్ దశాబ్దాలుగా పోరాటం సాగిస్తు న్నారు. సుదీర్ఘకాలంగా రష్యాను ఏలుతున్న వ్లాదమిర్ పుతిన్ విధానాల్ని, ప్రభుత్వ చర్యల్ని విమర్శిస్తూ మురాతోవ్ ఎన్నో వార్తా కథనాలు రాశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వాల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎదుర య్యాయి. అయినా వాటిని వెరువక ధైర్యంగా నిలబడ్డారు.