Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర కొరియా నేత కిమ్
- అస్థిరతకు మూలం అమెరికానే అంటూ విమర్శలు
ప్యాంగాంగ్ : అజేయమైన సైనిక శక్తిని రూపొందిస్తామని ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిన చేశారు. అత్యంత అరుదైన రీతిలో ఆయుధ వ్యవస్థలపై జరిగిన ఎగ్జిబిషన్‌ను ఆయన ఇక్కడ వీక్షించారు. అమెరికా, ఉద్రిక్తతలను సృష్టిస్తోందని, ఉత్తర కొరియా పట్ల తమకు ఎలాంటి ఘర్షణాయుత వైఖరి లేదని రుజువు చేసే చర్యలు తీసుకోవడం లేదని అంటూ అమెరికాపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక పాటవాలను పెంపొందించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కొరియన్లు ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకుని యుద్ధం జరపరాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాలక వర్కర్స్ పార్టీ 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం 'రక్షణాభివృద్ధి ఎగ్జిబిషన్, ఆత్మరక్షణ-2021'ని కిమ్ సందర్శించారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్ మాట్లాడారు. ఉత్తర కొరియా ఇలాంటి ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం ఇదే ప్రధమమని దక్షిణ కొరియా మీడియ తెలిపింది. ఉత్తర కొరియాతో తమకు ఎలాంటి ఘర్షణలు లేవని అమెరికా తరచుగా చెబుతోంది. కానీ ఆ దిశగా ఒక్క చర్య కూడా లేదని కిమ్ వ్యాఖ్యానించారు. తాము శత్రువులం కాదని నమ్మేలా వారు ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదని అన్నారు. తన తప్పుడు తీర్పులు, చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి అమెరికా ప్రయత్నిస్తూనే వుందని అన్నారు. కొరియా ద్వీపకల్పంలో అస్థిరతకు మూలంగా అమెరికాను ఆయన అభివర్ణించారు. ఎవరూ కూడా తమపై దండెత్తడానికి సాహసం చేయని రీతిలో అజేయమైన సైనిక శక్తి సామర్ధ్యాలను కలిగి వుండాలన్నదే తమ కీలకమైన లక్ష్యమని కిమ్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా హిపోక్రసీతో వ్యవహరిస్తోందని కిమ్ విమర్శించారు. ఉత్తర కొరియా ఆయుధ అభివృద్ధిని రెచ్చగొట్టే చర్యలుగా పేర్కొంటోందని అన్నారు. అయితే సియోల్ తమ లక్ష్యం ఎన్నడూ కాదని స్పష్టం చేశారు.