Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
బోస్టన్ : నల్గురు రైతులు, ఒక జర్నలిస్టుతో సహా 8 మందిని బలిగొన్న లఖింపూర్ ఖెరి ఘటన ''పూర్తిగా ఖండించదగినదే''నని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో అధికార పర్యటనలో వున్న తనకి ఎదురైన ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించారు. ''భారత్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని కూడా అవి జరిగినపుడు ఇదే విధంగా లేవనెత్తాలి, అంతేకానీ తమకు అనుకూలంగా ఉన్నవాటినే లేవనెత్తడం సరికాదని '' ఆమె వ్యాఖ్యానించారు. యుపిలో బిజెపి ప్రభుత్వం ఉంది కాబట్టి దానిని ఇరకాటంలో పెట్టడానికే దీనిని లేవనెత్తుతున్నారన్నట్లుగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి మంగళవారం హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆమె ఇబ్బంది పడ్డారు. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని, సీనియర్ మంత్రులు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ప్రశ్నిస్తే, ''అటువంటిదేమీ లేదు. ఈ సంఘటన గురించి మీరు ప్రశ్నించడం బాగుంది. ఈ ఘటన కచ్చితంగా ఖండించదగినదే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడే వాటిని ప్రస్తావించడం, ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. ఘటన జరిగిన ప్రాంతంలో బిజెపి అధికారంలో వుంది కాబట్టి వీటిని ప్రస్తావించాలనుకోవడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. భారత్ గురించి బాగా తెలిసిన అమర్యసేన్తో సహా పలువురు వీటి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని అన్నారు. మా మంత్రివర్గ సహచరుల్లో ఒకరి కుమారుడు సమస్యల్లో వున్నాడు. పూర్తిగా దర్యాప్తు క్రమం సాగిన తర్వాత న్యాయం జరిగి తీరుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ''మా పార్టీ గురించి, ప్రధాని గురించి నేను రక్షణాత్మకంగా మాట్లాడడం లేదు. భారత్ గురించే మాట్లాడతాను. పేదలకు జరగాల్సిన న్యాయం గురించే మాట్లాడతాను. నన్నెవరూ ఎగతాళి చేయరు, ఒకవేళ చేసినా నేను చేసినదాన్ని సమర్ధించుకోగలను, సారీ, మనం వాస్తవాలపై మాట్లాడుకుందాం. ఇదే నేను మీకిచ్చే సమాధానం'' అని ఆమె ఒకింత తత్తరపాటుకు గురయ్యారు. గత దశాబ్ద కాలంగా వివిధ పార్లమెంటరీ కమిటీల్లో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినవే ఆ మూడు వ్యవసాయ చట్టాలని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె తెలిపారు. పార్లమెంటులో ఎగువ సభలో మాత్రమే దీనిపై రచ్చ జరిగిందని అన్నారు.