Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబా, రష్యా అంగీకారం
హవానా : కోవిడ్ థర్డ్‌వేవ్‌తో ఇబ్బందులు పడుతున్న సమయంలో క్యూబన్ల కోసం 200టన్నుల మందులు, ఆహార పదార్ధాలను పంపించినందుకు క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్ రష్యాకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. పుతిన్ మాట్లాడుతూ, రష్యా, క్యూబాకు మద్దతును కొనసాగిస్తుందన్నారు. ఈ ఏడాది చివరిలోగా క్యూబాకు మరోసారి మానవతా సాయాన్ని పంపనున్నట్లు పుతిన్ చెప్పారు. భౌగోళికంగా దూరంగా వుండడమనేది పరస్పరం సానుభూతిగా వ్యవహరించేందుకు, మన ప్రజలను కలుపుతున్న ఐక్యతను గౌరవించేందుకు ఆటంకం కాబోదని డియాజ్ కానెల్ అన్నారు. ఇరు ప్రభుత్వాలు ఒకే విధమైన సూత్రాలను, సిద్ధాంతాలను పంచుకుంటాయని చెప్పారు. రష్యా, క్యూబా ప్రభుత్వాల మధ్య ఆర్థిక సహకారాన్ని అమలు చేసే విషయమై క్యూబా ఉపాధ్యక్షుడు, మంత్రివర్గ సభ్యులతో పుతిన్ చర్చలు జరిపారు. మెక్సికో తీరంలో క్యూబా చమురు నిల్వలను వెలికితీసేందుకు ఉద్దేశించిన వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోవడానికి ఉభయ పక్షాలు అంగీకరించాయి. రష్యా నుండి క్యూబాకు నేరుగా విమానాల రాకపోకలను పెంచేందుకు కూడా అంగీకారం కుదిరింది. క్యూబన్ల ఉత్పత్తుల పట్ల తాము ఆసక్తిగా వున్నామని, కాఫీ, పొగాకు, రమ్, చేపలు, సముద్ర ఉత్పత్తులు వంటి వాటి వాణిజ్యం కోసం మన పారిశ్రామికవేత్తలను అనుమతించాలని పుతిన్ కోరారు. క్యూబాకు గల పది వాణిజ్య భాగస్వాముల్లో రష్యా ఒకటి. తమ భాగస్వామ్యం వ్యూహాత్మకమైనదని ఇరు దేశాలు వ్యాఖ్యానించాయి.