Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోవియట్ వ్యవస్థకే సగం మంది రష్యన్లు మొగ్గు
మాస్కో : కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కొనసాగుతున్నా రష్యాలో ఇంకా సోషలిజం భావన, ప్రతిష్ట అత్యున్నత స్థాయిల్లో వుంది. రష్యాలో ప్రతి విప్లవం వచ్చి, పెట్టుబడిదారీవాదం పునరుద్ధరించబడి 30 ఏండ్లు గడిచాక కూడా ఈ పరిస్థితి నెలకొంది. లెవడా సెంటర్ ఇటీవల నిర్వహించిన పోలింగ్లో సగం మంది రష్యన్లు సోవియట్ వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారని వెల్లడైంది. సోషలిస్టు కాలం నాటి గణనీయమైన విజయాలను వారు అభినందిస్తున్నారని స్పష్టమైంది. ఆగస్టు 19-26మధ్య ఈ సర్వేను నిర్వహించారు. సోవియట్ రాజకీయ వ్యవస్థకు సగం మంది రష్యన్లు (49శాతం) ప్రాధాన్యత ఇస్తున్నారు. 2వేల సంవత్సరం ప్రారంభం తర్వాత ఇది అత్యధిక సంఖ్యగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను కేవలం 18శాతం మందే సమర్ధిస్తున్నారు. ''పశ్చిమ దేశాల తరహాలో ప్రజాస్వామ్యం'' అత్యుత్తమమైన రాజకీయ వ్యవస్థ అని మరో 16శాతం మంది విశ్వసిస్తున్నారు. సోవియట్ రాజకీయ వ్యవస్థను అత్యంత తీవ్రంగా ఇష్టపడుతున్న వారిలో 55ఏండ్లు, అంతకుమించి వయస్సు వున్న వారు ఎక్కువమంది (దాదాపు 62శాతం) వుండడం విశేషం. యూఎస్ఎస్ఆర్లో గడిపిన జీవితంలో వారికి చాలా మంచి జ్ఞాపకాలు వున్నాయి. అత్యుత్తమమైన ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వ ప్రణాళికా, పంపిణీలో పొందుపరచాలని మూడింట రెండు వంతుల మంది రష్యన్లు (62శాతం) విశ్వసిస్తున్నారు. ప్రయివేట్ ఆస్తులు, మార్కెట్ సంబంధాలపై ఆధారపడిన వ్యవస్థ వైపు కేవలం 24శాతం మందే మొగ్గు చూపారు. సోషలిజం-కమ్యూనిజాన్ని, సోవియట్ శకాన్ని విమర్శిస్తూ బూర్జువా పెట్టుబడిదారీ వాదం ఎన్ని అపవాదులు వేయడానికి తీవ్రంగా ప్రయత్నించినా రష్యాలో సోషలిజం సూత్రాలకు ఇంకా లోతైన మూలాలు వున్నాయని ఈ సర్వే తెలియచేస్తోంది. ఇటీవలి చట్ట సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ (సీపీఆర్ఎఫ్) సీట్ల పరంగా బలోపేతం కావడం కూడా మరో సంకేతమే. ఏడాది క్రితం నిర్వహించిన ఇటువంటి పోల్లో 47శాతం మంది రష్యన్లు పెరెస్త్రోయియా విధానానికి ముందుగా దేశంలో పరిస్థితి బాగుందని పేర్కొన్నారు. అదేసమయంలో దేశ చరిత్రలోనే అత్యుత్తమమైన కాలమంటే సోవియట్ శకమేనని 75శాతం మంది రష్యన్లు అభిప్రాయపడుతున్నారు.