Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు మాసాల పాటు అంతరిక్షంలోనే ముగ్గురు వ్యోమగాములు
బీజింగ్ : రోదసీ నౌక షెంఝూ-13ని చైనా శనివారం ప్రయోగించింది. ఈ నౌక ద్వారా ముగ్గురు వ్యోమగాములను రోదసీ స్టేషన్ కోర్ మాడ్యూల్ తియాన్హెకి పంపించారు. వీరు ఆరు మాసాల పాటు అక్కడ రోదసీ స్టేషన్లో వుండి తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రయోగించిన 582 సెకన్ల తర్వాత, షెంఝూ-13 నౌక రాకెట్ నుంచి విడిపోయి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రయోగం విజయవంతమైందని, సిబ్బంది అందరూ ఆరోగ్యంగా వున్నారని సిఎంఎస్ఎ ప్రకటించింది. కమాండర్, రోదసీలో నడిచిన మొదటి చైనీయుడు ఝాయి జిగాంగ్, మొదటి మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్, రోదసీకి కొత్త వ్యోమగామి అయిన యా గుయాంగ్ఫూ ఆ ముగ్గురు ఆ నౌకలో వున్నారు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబరు వరకు వున్న కాలమే ఇప్పటివరకు రోదసీలో ఎక్కువగా వున్న సమయం, ఇప్పుడు దాన్ని అధిగమించి వీరు ముగ్గురు ఆరు మాసాలు రోదసీలో వుండి రికార్డు సృష్టించనున్నారు. కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత, షెంజూ-13 రోదసీ నౌక చాలా వేగంగా, ఆటోమేటిక్గా రోదసీ స్టేషన్ కోర్ మాడ్యూల్తో అనుసంథానమవుతుంది. ఆ మాడ్యూల్లోనే వ్యోమగాములు వుంటారు. బయటి కార్యకలాపాలను, మెకానికల్ ఆర్మ్లను, మాడ్యూల్ ట్రాన్స్ఫర్ పరీక్షలను నిర్వహించడంతో సహా అన్ని రకాల విధులు, కర్తవ్యాలను వీరు చేపడతారు. కక్ష్యలో వ్యోమగాములు సుదీర్ఘ కాలం వుండడానికి అవసరమైన కీలకమైన సాంకేతికతలను, జీవించడానికి అవసరమైన తోడ్పాటును కూడా వీరు పరిశీలిస్తారు.