Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మంది అరెస్టు
- మత ఘర్షణలపై బంగ్లాదేశ్ పోలీసుల చర్యలు
ఢాకా : బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న మతపరమైన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఆదివారం నాలుగు వేల మందికి పైగా ఆందోళనకారులపై కేసులు నమోదు చేయడంతో పాటు 20 మందిని అరెస్టు చేశారు. చిట్టగాంగ్ డివిజన్ కుమిల్లా పట్టణంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గా పూజ సందర్భంగా ముస్లిముల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో శుక్రవారం ఆందోళనల సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, ప్రభుత్వ విధులకు అటంకం కలిగించడం వంటి అభియోగాలతో ఢాకాలోని పల్తాన్, రమ్నా, చౌక్‌బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు వేల మందికి పైగా ఆందోళనకారులపై కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పల్తాన్ పోలీసుస్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మహ్మద్ సలాలుద్దీన్ మియా మాట్లాడుతూ 11 మంది గుర్తించిన వారితోపాటు రెండు వేల నుంచి 2,500 మంది గుర్తు తెలియని నిరసనకారులపై తమ స్టేషన్ పరిధిలోని కేసులో నమోదు చేశామని వెల్లడించారు. హింసాత్మక ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు. రమ్నా పోలీసుస్టేషన్లో 10 మంది గుర్తించిన వారితోపాటు 1400-1500 మంది గుర్తుతెలియని ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక్కడ 10 మందిని అరెస్టు చేశారు. చౌక్‌బజార్ పోలీసుస్టేషన్లో 35-40 మంది పేర్లు తెలియని వారిపై కేసు నమోదు చేయడంతోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తస్తిమా అక్తర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత కక్‌రైల్ నైటింగేల్ క్రాసింగ్, బిజోరునగర్, చౌక్‌బజార్ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. దుర్గా పూజ వేడుకల సందర్భంగా ఇస్లామిక్ పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలపై హింస చెలరేగుతోంది. మతపరమైన హింసను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. దాడులు చేసిన వారిని మతాలకతీతంగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు.