Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి పది మందిలో ముగ్గురి పరిస్థితిది
- యూనిసెఫ్ హెచ్చరిక
న్యూయార్క్ : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్నది. అనేక అంటు వ్యాధులు సైతం ఆయా దేశాల్లో తీవ్రంగా విజృంభిస్తున్నాయి. ఈ తరుణంలో వైద్యులు, ఆరోగ్య నిపుణులు ప్రజలకు తెలిపే అతి కీలక సూచనల్లో 'చేతులను శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్‌వాష్)' ఒకటి. అయితే, హ్యాండ్‌వాష్ విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కనీస సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ' గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే' సందర్భంగా ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన 'యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్)' వెల్లడించింది. ప్రతి పది మందిలో ముగ్గురికి వారి ఇండ్ల వద్ద హ్యాండ్వాషింగ్కు అవసరమైన సబ్బు, నీరు వంటివి లేవని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాలు కలిగి లేనివారి సంఖ్య 230 కోట్లు (2.3 బిలియన్లు) గా ఉన్నదని పేర్కొన్నది.
తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నదని యూనిసెఫ్ హెచ్చరించింది. ఇక్కడ ప్రతి పది మందిలో ఆరుగురికి పైగా చేతి శుభ్రతను పొందడంలేదని వివరించింది. చేతి శుభ్రతలో పురోగతి వెనకబడిన, అణగారిన వర్గాల్లో ఇప్పటికీ చాలా నెమ్మదించిందని యూనిసెఫ్ వాష్ డైరెక్టర్ కెల్లి ఆన్న్ నేరులర్ అన్నారు. నీరు, శానిటైజేషన్, పరిశుభ్రత విషయంలో సుదీర్ఘ పెట్టుబడులు రాబోయే ఆరోగ్య విపత్తును నిరోధిస్తాయని చెప్పారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం 2015 నుంచి పరిస్థితిలో కొంత పురోగతి వచ్చింది. ఉదాహరణకు.. ఇంటి వద్ద చేతి శుభ్రతను పొందేవారి సంఖ్య 500 కోట్ల నుంచి 550 కోట్లకు ( అంటే 67 శాతం నుంచి 71 శాతం పెరుగుదల) పెరిగింది. అయితే, ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే దశాబ్దం చివరినాటికి కనీస చేతి శుభ్రతను పొందనివారి సంఖ్య 190 కోట్లుగా నమోదు కానున్నది.
యూనిసెఫ్ తాజా గణాంకాల ప్రకారం..
- ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల మంది ప్రజలకు (670 మిలియన్) చేతి శుభ్రత కోసం ఏ ఒక్క సదుపాయమూ లేదు.
- ప్రతి ఐదింటిలోని రెండు స్కూళ్లలో నీరు, సబ్బు వంటి కనీస పరిశుభ్రత సౌకర్యాలు లేవు. దీంతో 81.8 కోట్ల మంది( 818 మిలియన్ల మంది) విద్యార్థులు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో 46.2 కోట్ల మంది విద్యార్థులకు ఏ సౌకర్యమూ లేకపోవడం గమనార్హం.
- తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రతి పదింటిలో ఏడు స్కూళ్లలో చిన్నారులకు చేతులను కడుక్కోవడానికి చోటే లేదు. ఈ దేశాల్లో 2030 నాటికి చేతి శుభ్రతను అందించడం కోసం 11 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా.
కాగా, ఈ విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని యూనిసెఫ్ కోరింది. గుడ్ గవర్నెన్స్, స్మార్ట్ పబ్లిక్ ఫైనాన్స్, కెపాసిటీ బిల్డింగ్, నిర్ధిష్ట సమాచారం, ఇన్నోవేషన్ అనే ఐదు అంశాలతో హ్యాండ్ హైజీన్‌ను వేగం చేయడానికి ప్రభుత్వాలకు దోహదం చేస్తాయని యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ సంయుక్త నివేదిక సూచించింది.