Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస రాయబారి క్రిస్టేన్ హెచ్చరిక
న్యూయార్క్: మయన్మార్‌లో సైన్యం పాలనను చేజిక్కించుకున్న తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా ఉన్న క్రిస్టేన్ స్క్రానెర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటు దేశంలో సాయుధ సంఘర్షణకు దారితీసిందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అధికారాన్ని తిరిగి ఇవ్వకపోతే మయన్మార్ ఒక ''విఫలమైన దేశం'' అనే దిశగా వెళుతుందని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిస్టేన్ మాట్లాడుతూ మయన్మార్‌లో తిరుగుబాటు అనంతరం దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్యం, పౌరుల మధ్య ఘర్షణ తీవ్రతరమౌతోందని తెలిపారు. సైన్యం అణచివేత కారణంగా 1,180 మందికి పైగా ఆందోళనకారులు మరణించారని పేర్కొన్నారు. గ్రామాలను తగులబెట్టడం, ఆస్తులను లూటీ చేయడం, పెద్దయెత్తున అరెస్టులతో పాటు ఖైదీలపై హింస, లింగ ఆధారిత హింస, నివాస ప్రాంతాలకు తుపాకీ కాల్పులకు పాల్పడం వంటి దారుణాలకు సైన్యం పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్తో పాటు ఇతర రాష్ట్రాల్లో సైన్యం క్లియరింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తోందని.. కచిన్, షాన్ వంటి రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం క్రమంగా మిలటరైజ్ అవుతోందని, అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వ మద్దతుదారులు ఏర్పాటు చేసిన నేషనల్ యూనిటీ గవర్నమెంట్ పెద్దయెత్తున ప్రజా రక్షణ దళాలను సమీకరించే యోచనలో ఉందని, ప్రజా రక్షణ యుద్ధానికి పిలుపునిచ్చిందని క్రిస్టేన్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ జోక్యం లేని సమయంలో చివరిగా హింసను సమర్ధించాల్సిన పరిస్థితులు వస్తాయని అన్నారు.