Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అధ్యక్షుడు బైడెన్
వాషింగ్టన్: తైవాన్ను చైనా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే తైవాన్‌కు అమెరికా అండగా, రక్షణగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బల్తిమోర్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన సీఎన్ఎన్ టౌన్‌హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అవును.. ఆ విషయంలో మాకు నిబద్ధత ఉంది' అని అన్నారు. ప్రపంచంలోనే తమకు శక్తివంతమైన మిలటరీ ఉందన్న విషయం చైనా, రష్యాతో పాటు మొత్తం ప్రపంచానికి తెలుసని పేర్కొన్నారు. అయితే బైడెన్ ప్రకటన అమెరికా దీర్ఘకాలంగా అనుసరిస్తున్న 'అస్పష్టమైన వ్యూహం'కు విరుద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తైవాన్ రక్షణ నిర్మాణంలో సాయం చేస్తామని ఇప్పటి వరకు చెబుతున్న అమెరికా.. ఆ ద్వీపానికి అండగా, సాయంగా ఉంటామని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఆగస్టులో కూడా ఎబిసి మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ తైవాన్‌తో సహా అన్ని కీలక మిత్రదేశాలను అమెరికా కాపాడుతుందని ప్రకటన చేశారు. కెనడా, యూరప్‌లోని నాటో మిత్రదేశాలను కాపాడేందుకు అమెరికా ఒక గట్టి నిబద్ధత తీసుకుందని.. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ విషయంలో కూడా దాన్నే ఆనుసరిస్తామని అన్నారు. ఈ రెండు సందర్భాల్లో వైట్‌హౌస్ స్పందిస్తూ.. తైవాన్ విషయంలో అమెరికా విధానంలో మార్పు లేదని మీడియాకు తెలిపింది.