Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూరోపియన్ యూనియన్‌కు చైనా హెచ్చరిక
బీజింగ్: తైవాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు పిలుపునిస్తూ యూరోపియన్ పార్లమెంట్ తాజాగా ఆమోదించిన తీర్మానాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్యలను తక్షణంగా విరమించుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ హెచ్చరించారు. తైవాన్‌తో వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలని, అదేవిధంగా అక్కడ ఉన్న బ్లాక్ ట్రేడ్ ఆఫీసుకు యూరోపియన్ యూనియన్ ఆఫీస్ ఇన్ తైవాన్‌గా పేరు మార్చాలని ఈయూ పార్లమెంట్ తీర్మానం పేర్కొంది. చైనా, అమెరికా మధ్య పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తైవాన్ కొత్త కేంద్ర బిందువుగా మారింది. అంతకుముందు జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఉరుఘర్ ముస్లిములు అణచివేతకు గురవుతున్నారని ఆరోపించడంతో పాటు హాంకాంగ్ పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేసింది. తైవాన్ విషయంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అక్కడ తన బలగాలను మోహరించింది. తైవాన్ సైనికులను శిక్షణ ఇచ్చేందుకు గతేడాది నుంచే తన ప్రత్యేక కార్యకలాపాల దళాలను రంగంలోకి దించింది. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన చైనా.. తైవాన్ నుంచి సైన్యాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఇప్పటికే డిమాండ్ చేసింది. తైవాన్‌కు 180 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల అమ్మకం ఒప్పందాన్ని అమెరికా గతేడాది ఆమోదించిది. ఈ ఆయుధాల జాబితాలో మొబైల్ రాకెట్ లాంచెర్లు, గైడెన్ క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి.