Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామల్లా: వెస్టుబ్యాంకు, తూర్పు జెరూసలేం ప్రాంతాల్లో పాలస్తీనియన్ చిన్నారులపై ఇజ్రాయిల్ బలగాల దురాగతాలను యూరోపియన్ యూనియన్ (ఇయు) మిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దళాలు పాలస్తీనా చిన్నారులపై వరుస ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని పేర్కొంది. మైనర్లపై బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఈనెల 8 నుంచి 18 మధ్య ఇజ్రాయిల్ బలగాల దాష్టీకాలకు వెస్టుబ్యాంక్ నగరమైన బెత్లహెంలో ఒక పాలస్తీనా చిన్నారి బలవగా, తూర్పు జెరూసలేంలో 41 మందిని అరెస్టు చేశారు. చిన్నారులపై పాల్పడుతున్న ఈ తరహా హింసను తక్షణం మానుకోవాలని, అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం వారి హక్కులను గౌరవించాలని ఇజ్రాయిల్‌కు ఇయు హితవు పలికింది. వెస్టుబ్యాంకు, గాజా స్ట్రిప్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ బలగాలు 74 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని పాలస్తీనాలోని పలు చిన్నారుల హక్కుల పరిరక్షణ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయిల్ బలగాలు చట్టవిరుద్ధమైన హత్యలు, అధిక బలప్రయోగం, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. 225 మంది పాలస్తీనా చిన్నారులను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారని ది పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్ అసోసియేషన్ పేర్కొంది.