Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహించనున్నట్టు చట్టంలో చైనా పేర్కొంది. చర్చల ద్వారానే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వెల్లడించింది. చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం శనివారం ముగిసింది. కాగా ఈ సమావేశంలో నూతన చట్టానికి ఆమోదం తెలిపినట్టు ఆ దేశ అధికార మీడియా 'జిన్హువా' వెల్లడించింది. కాగా ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.సరిహద్దుల్లో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్టు ఆ చట్టంలో చైనా వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్టు తెలిపింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రత వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రెండు దేశాలతో..
చైనాకు పొరుగున ఉన్న 12 దేశాలతో సరిహద్దును నిర్ణయించుకున్నప్పటికీ, భారత్, భూటాన్‌తో మాత్రం ఆ దేశానికి స్పష్టమైన సరిహద్దు రేఖ లేదు. దాంతో భారత్, భూటాన్ దేశాలతో చైనాకు ఎప్పట్నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్‌తో 3488 కిలోమీటర్లు, భూటాన్‌తో 400 కిలోమీటర్లమేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది. లద్దాఖ్‌లో భారత భూభాగంలోని పలు ప్రాంతాల్లో చైనా సైన్యం తన ఆధీనంలోకి తీసుకుందని భారత ప్రభుత్వం ఆరోపిస్తోంది. డోక్లాం వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సరిహద్దు వెంట ఇప్పటి వరకూ చేపట్టిన చర్యల్ని సమర్థించుకునేందుకు చైనా తాజా చట్టం తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.