Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారాన్ని కైవసం చేసుకున్న మిలటరీ
- తాత్కాలిక ప్రభుత్వ రద్దు
- అత్యవసర పరిస్థితి ప్రకటన
ఖార్టూమ్ : సూడాన్ మిలటరీ సోమవారం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తాత్కాలిక ప్రధాని హమ్దోక్ను, ఇతర అధికారులను అరెస్టు చేసిన కొద్దిగంటల తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సైనిక కుట్రను నిరసిస్తూ వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యం దిశగా తడబడుతూ అడుగులు వేస్తున్న దేశ ప్రగతికి ఈ కుట్ర పెద్ద ముప్పుగా పరిణమించింది. దీర్ఘకాల నియంత ఒమర్ అల్ బషీర్‌ను పదవీచ్యుతుని చేసిన రెండేళ్ళ తర్వాత, ప్రభుత్వానికి మిలటరీ అధికారాన్ని బదిలీ చేయడానికి కొద్ది వారాల ముందుగా సైనిక కుట్ర ద్వారా దేశాన్ని కైవసం చేసుకున్నారు. సోమవారం తెల్లవారు జామునే ప్రధానిని, ఇతర అధికారులను అరెస్టు చేశారు. ఇది తెలిసిన వెంటనే రాజధాని ఖార్టూమ్ వీధుల్లోకి వేలాదిమంది వచ్చారు. వీధులను దిగ్బంధిస్తూ, టైర్లకు నిప్పు పెడుతూ వారు ఆందోళనలు చేశారు. కాగా, వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పెద్ద ఎత్తున గాల్లోకి పొగ కమ్ముకుంది. 'ప్రజలు బలవంతులు' 'తిరోగమనం ఒక అవకాశం కాదు' అంటూ ఆందోళనకారులు నినదించడం వినిపించింది. నైలు నదిపై వంతెనలు దాటి రాజధానిలోకి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రదర్శనల్లో 12మంది ఆందోళనకారులు గాయపడ్డారు. ప్రభుత్వాన్ని, సార్వభౌమ మండలిని రద్దుచేస్తున్నట్లు మధ్యాహ్నం మిలటరీ హెడ్ జనరల్ అబ్దుల్ ఫత్తా బుర్హాన్ టివిలో ప్రకటించారు. అల్ బషర్‌ను పదవీచ్యుతుని చేసిన తర్వాత నాలుగు నెలలకు సైనిక, పౌర సంస్థగా ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు కారణంగానే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని బుర్హాన్ తెలిపారు. సూడాన్ భవిష్యత్ కార్యాచరణ, ప్రజాస్వామ్యానికి పరివర్తన క్రమంపై పౌర, సైనిక నేతల మధ్య ఘర్షణల వల్లే గత కొద్ది వారాలుగా ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. అత్యవసర పరిస్థితి ప్రకటిస్తున్నట్లు మిలటరీ జనరల్ ప్రకటించారు. 2023 జులైలో జరగాల్సిన ఎన్నికల దిశగా దేశాన్ని నడిపించేందుకు ఈలోగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సైన్యం ప్రకటించింది. మిలటరీనే ఇన్చార్జిగా వుంటుందని ఆయన స్పష్టం చేశారు.