Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-20 దేశాల ఆర్థిక, ఆరోగ్య మంత్రుల పిలుపు
- నేటి నుంచి జీ-20 సమ్మిట్
- భారీ నిరసనలకు సిద్ధమైన ఆందోళనాకారులు
రోమ్: ప్రపంచవ్యాప్తంగా రాబోయే ఎనిమిది నెలల్లో 70 శాతం మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందాలని జీ-20 దేశాలకు చెందిన ఆర్థిక, ఆరోగ్య మంత్రులు పిలుపునిచ్చారు. మహమ్మారిపై గట్టిగా పోరాడటానికీ, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును ప్రకటించారు. '' అన్ని దేశాలలో 2022 మధ్య వరకు 70 శాతం, 2021 చివరి నాటికి కనీసం 40 శాతం మందికి టీకాలు వేయాలనే ప్రపంచ లక్ష్యాల దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్లు, అత్యవసర మెడికల్ ఉత్పత్తులు, ఇన్పుట్లు అందించడానికి, సరఫరా సంబంధిత, ఆర్థిక నిరోధాలను తొలగించడంలో మేము చర్యలు తీసుకుంటాం'' అని జీ-20 మంత్రులు తెలిపారు. కాగా, నేటి నుంచి రెండు రోజుల (శని, ఆదివారాలు) పాటు జీ-20 సమ్మిట్ జరగనున్నది. ఇది 16వ జీ-20 సమావేశం. ఈ సమ్మిట్‌కు ముందు రోజు మంత్రుల సమావేశం జరిగింది.
రెండేండ్ల తర్వాత తొలిసారిగా..
జీ-20 కూటమిలో యునైటెడ్ స్టేట్స్, చైనా, భారత్, జర్మనీ వంటి దేశాల జనాభా వాటా 60 శాతంగా ఉన్నది. అలాగే, గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌పుట్‌లో 80 శాతానికి పైగా ఉన్నది. కరోనా మహమ్మారి ప్రవేశంతో దాదాపు రెండేండ్ల తర్వాత జీ-20 లీడర్ల ముఖా-ముఖి సమావేశం ఇదే మొదటిది కావడం గమనార్హం. అయితే, ఇటలీ రాజధాని రోమ్‌లో జరగనున్న జీ-20 సమావేశానికి చైనా, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా దేశాధినేతలు ప్రస్తుత సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించిన విషయం విదితమే. అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతీన్లు వీడియో లింక్ ద్వారా చర్చల్లో పాల్గొననున్నట్ట సమాచారం.
వాతావరణ సమస్య మేజర్ టాపిక్..!
కరోనా, తదనంతర పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ, పెరుగుతున్న ఇంధన ధరలు వంటివి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే, పెద్ద కంపెనీల కోసం 15 శాతం మినిమమ్ గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ మీద జీ20 లీడర్లు సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ఈనెల ప్రారంభంలో ఖరారైన విషయం విదితమే. ఇక సమ్మిట్‌లో వాతావరణ సమస్య మేజర్ టాపిక్‌గా ఉండనున్నది. ఇక గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలకు సంబంధించి జీ20 దేశాల వాటా దాదాపు 80 శాతం వరకు ఉంటుందన్నది అంచనా. అయితే, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోకపోవడంపై పర్యావరణవేత్తలు, కార్యకర్తలు జీ20 కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేసే లక్ష్యాన్ని చేరడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని జీ20 నాయకులు ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. కాగా, ఆఫ్ఘన్లో పరిస్థితుల పైనా సమ్మిట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఆఫ్ఘన్‌లోని మహిళా నాయకులకు రక్షణ, భద్రత కల్పించాలని జీ20 నాయకులకు ఉమెన్ పోలిటికల్ లీడర్స్ పిలుపునిచ్చింది.
నిరసనల సెగ
జీ20 సమ్మిట్ నేపథ్యంలో రోమ్‌లో పలు నిరసన ర్యాలీలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. పర్యావరణానికి సంబంధించి శుక్రవారం విద్యార్థులు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అయితే, శనివారం భారీ నిరసనలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. కమ్యూనిస్టు పార్టీ శనివారం మధ్యాహ్నం నిరసనకు దిగనున్నది. అనంతరం జరిగే మార్చ్‌లో దాదాపు 10వేల మంది పాల్గొననున్నారని తెలిసింది.