Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభమైన జి-20 సదస్సు
- వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలను పరిష్కరించాలి
రోమ్ : కరోనా మహమ్మారి తలెత్తిన తర్వాత మొదటిసారిగా జి 20దేశాల అధినేతలు శనివారం నాడిక్కడ సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచవ్యాప్తంగా కనీస కార్పొరేట్ పన్ను రేటు వంటి అంశాలు ఈ సమావేశ అజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. రోమ్‌లోని నువోలా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఈ సదస్సుకు విచ్చేసిన జి-20దేశాల అధినేతలకు ఇటలీ ప్రధాని మారియో డ్రాగి స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా నేత జిన్‌పింగ్ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. శనివారం ఉదయం ప్రారంభ సమావేశం ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టింది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమంపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలను చర్చించేందుకు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాధినేతలు విడిగా సమావేశమయ్యారు.కాలుష్య కారక వాయువులను అరికట్టడానికి తక్షణమే అత్యవసర చర్యలు తీసుకోని పక్షంలో తీవ్ర పర్యవసానాలు ఎదురవగలవని హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోంది. నిరుపేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్లు అందాలని, ఇందుకోసం మరింత ముమ్మరంగా ప్రయత్నాలు జరగాలని ఇటలీ నేత డ్రాగి పిలుపిచ్చారు.
సంపన్నదేశాల్లో దాదాపు 70శాతం మంది వ్యాక్సిన్ తీసుకోగా, పేద దేశాల్లో 3శాతం మందే వ్యాక్సిన్ తీసుకోగలిగారని అన్నారు. ఇది నైతికంగా ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ అసమానతలను పరిష్కరించే దిశగా బహుముఖ సహకారం కావాలని కోరారు. మనం మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న కొద్దీ బహుముఖ సహకారం మాత్రమే ఈనాటి ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గమనేది సుస్పష్టమవుతోందని అన్నారు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇదొక్కటే పరిష్కారమన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 80శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి జి-20 కీలకమైన హామీలు పొందాలని ఇటలీ ఆశిస్తోందన్నారు. అంతే స్థాయిలో కాలుష్య కారకాలకు కూడా ఈ దేశాలు కారణమవుతున్నాయని అన్నారు.
అరకొర హామీలతో ముప్పే : ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్
పెద్ద మొత్తంలో కాలుష్యానికి కారణమయ్యే దేశాల నుంచి అరకొరగా హామీలు వచ్చినట్లయితే గ్లాస్గో సదస్సు విఫలమవగలదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ హెచ్చరించారు. తమలో తమకి వున్న అపనమ్మకం స్థాయిలను, వర్ధమాన దేశాలతో వున్న అభిప్రాయ భేదాలను అధిగమించాల్సిందిగా జి-20 దేశాలను కోరారు. రోమ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గ్లాస్గో సదస్సు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతే, ప్రపంచమే ప్రమాదంలో పడుతుందన్నారు. సమావేశాలకు ముందుగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ,, ఇప్పుడు సరైన రీతిలో స్పందించకపోతే మన నాగరికత వెనక్కి మళ్లుతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాల జీవితం దారుణంగా మారుతుందని అన్నారు. జి 20 సమావేశాలు, గ్లాస్గో సదస్సులు గ్లోబల్ వార్మింగ్‌ను ఆపలేవు కానీ ఆ క్రమాన్ని నెమ్మదింపచేయవచ్చని అన్నారు. గ్లోబల్ ఉష్ణోగ్రతల పెంపును 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే దిశగా జి20 కృషి చేస్తుందనే హామీతో ముసాయిదా ప్రకటన రూపొందింది. చట్టపరంగా కట్టుబడే ఒప్పందాలేవీ లేవు. అక్రమంగా చెట్లు కొట్టివేయడం, గనుల తవ్వకాలు, వన్యప్రాణి వ్యాపారాలు వంటివి నిలుపుచేసేందుకు నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలని ముసాయిదా కోరుతోంది.
బైడెన్‌తో మోడీ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా పలువురు ప్రపంచ నేతలతో భేటీ అయ్యారు. పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ, పుష్పగుచ్ఛాలు అందుకుంటూ నేతలందరూ బిజీ బిజీగా గడిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఈ మేరకు పలు ఫోటోలను విడుదల చేసింది. తర్వాత ప్రపంచ నేతలందరూ కలిసి ఫ్యామిలీ ఫోటోకు ఫోజిచ్చారు. జి 20 సదస్సు సందర్భంగా విచ్చేసిన ఇతర నేతలతో మోడీ విస్తృత అంశాలపై చర్చలు జరిపారు.