Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ మార్పులు, దారిద్య్రంపై చర్చ
- భారత్‌కు రావాల్సిందిగా మోడీ ఆహ్వానం
వాటికన్ సిటీ : పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్‌కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. శనివారం ఉదయం వాటికన్ సిటీలో మోడీ, పోప్‌తో భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం వారి సమావేశం అరగంటే జరగాల్సి ఉన్నా, గంటసేపు భేటీ అయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 'పోప్‌తో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. విస్తృతమైన అంశాలపై ఆయనతో చర్చించేందుకు అవకాశం కలిగింది. ఆయనను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించినట్లు' మోడీ సమావేశానంతరం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రధానంగా వాతావరణ మార్పులు, దారిద్య్రాన్ని నిర్మూలించడం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. మోడీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగాలా వున్నారు. వెండి కేండిల్‌ను, 'ది క్లైమేట్ క్లైంబ్ : ఇండియాస్ స్ట్రాటజీ, యాక్షన్స్, అచీవ్మెంట్స్' పుస్తకాన్ని మోడీ పోప్‌కు బహుమతిగా అందజేశారు. బదులుగా పోప్ తన బోధనల సంపుటిని, కాంస్య పతకాన్ని బహూకరించారు. ఆ కాంస్య పతకంపై ఒక చెట్టు, 'ఎడారి కూడా నందనవనంగా మారుతుంది.' అని ఇటాలియన్ భాషలో రాసి వుంది. వాతావరణ మార్పులపై సత్వరమే కార్యాచరణ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి పోప్ గట్టిగా చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే శరణార్థులను అనుమతించాల్సిందిగా ఆయన ప్రపంచ దేశాలను కోరారు. వర్ణ వివక్ష, ఇతర విద్వేష నేరాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. 1999లో అప్పటి పోప్ జాన్ పాల్ 2 భారత్‌లో పర్యటించారు. మళ్లీ ఇప్పుడు మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పారోలిన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. వాటికన్ సమావేశానికి ప్రత్యేకంగా అజెండా అంటూ ఏమీ లేదని, మర్యాదపూర్వకంగా ఆయన్ని కలుసుకోవడమేనని హర్షవర్ధన్ శ్రింగాలా తెలిపారు.