Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకలి సమస్య పరిష్కారానికి బిలియనీర్లు ముందుకు రావాలి: యుఎన్డబ్ల్యుఎఫ్పి ఇడి డేవిడ్ పిలుపు
జెనీవా : కరోనా సంక్షోభంలో కూడా ప్రపంచవ్యాప్తంగా శతకోటీశ్వరుల సంపద రోజురోజుకు పైకి ఎగబాకుతోంది. ధనికులు మరింత ధనికులుగా, పేదలు ఇంకా పేదలుగా మారుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (యుఎన్డబ్ల్యుఎఫ్పి) డేవిడ్ బీస్లీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్, టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్ వంటి బిలియనీర్లు ప్రపంచ ఆకలి సమస్యను పరిష్కరించేందుకు ఒకసారి ముందుకు రావాలని, ఇందుకు తమ సంపదలో కనీస శాతాన్ని అందించాలని పేర్కొన్నారు. వీరు తమ సంపదలో 0.36 శాతం కేటాయిస్తే దాదాపు 4.2 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడుకోవచ్చని సిఎన్ఎన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా అన్నారు. 64 ఏళ్ల డేవిడ్ బీస్లీ సుదీర్ఘకాలం రాజకీయ నేతగా కొనసాగారు. 1995 నుంచి 1999 వరకు అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. ఆకలి సమస్య వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దాదాపు 600 కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఆయన ఇంతకుముందు పేర్కొన్నారు. ప్రస్తుత ఆహార కొరతను అధిగమించడానికి మస్క్ సంపదలో 2 శాతం సరిపోతుందని కనెక్ట్ ది వరల్డ్ ప్రోగ్రామ్ సందర్భంగా బీస్లీ చెప్పారు. 4.2 కోట్ల మందికి సాయం చేసేందుకు 600 కోట్ల డాలర్లు అవసరం అవుతాయని పునరుద్ఘాటించారు. ''మనం వారికి సహాయం చేయకపోతే చనిపోతారు. ఇది చాలా తీవ్రమైన అంశం'' అని పేర్కొన్నారు. మస్క్ నికర ఆస్తుల విలువ దాదాపు 28,900 కోట్ల డాలర్లుగా ఉందని జర్మన్ బ్రాడ్కాస్టర్ డ్యుయిష్ వెల్లే ఇటీవల నివేదించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఒక సందర్భంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ 2020లో లాటిన్ అమెరికాలోని ధనవంతుల సంపద దాదాపు 500 కోట్ల డాలర్ల మేర పెరిగిందని చెప్పారు. కరోనా సమయంలో లబ్ధి పొందిన వారికి 'సాలిడారిటీ ట్యాక్స్ (సంఘీభావ పన్ను) వేయాలని ప్రతిపాదించారు.