Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందానికి జీ20 దేశాధినేతల ఆమోదం
- చారిత్రాత్మక అడుగుగా వర్ణన
రోమ్ : ప్రపంచ పన్ను (గ్లోబల్ ట్యాక్స్) సంస్కరణల ఒప్పందానికి జీ-20 సదస్సు ఆమోదముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 15 శాతం కార్పొరేట్ పన్ను ఉండాలన్న ఒప్పందానికి జి-20 దేశాల అధినేతలు ఆమోదం తెలిపారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి జెనెత్ యెలెన్ శనివారం పేర్కొన్నారు. ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా ఆమె అభివర్ణించారు. ''ఈ రోజున గ్లోబల్ మినిమం ట్యాక్స్‌తో పాటు కొత్త అంతర్జాతీయ పన్ను నిబంధనల విషయంలో ప్రతి జీ20 దేశాధినేత చారిత్రాత్మక ఒప్పందానికి ఆమోదం పలికారు. తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధానంతో జరుగుతున్న నష్టానికి ఇది ముగింపు పలుకుతుంది'' అని రోమ్‌లో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా పేర్కొన్నారు. బహుళజాతి కంపెనీలపై మరింత పారదర్శకంగా పన్ను విధింపుతోపాటు గ్లోబల్ కార్పొరేషన్లపై కనీసంగా 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ వేసేందుకు ప్రపంచ జీడీపీలో 90 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 136 దేశాలు ఓఈసీడీ-బ్రోకర్డ్ డీల్‌పై సంతకాలు చేశాయి. ట్యాక్సేషన్ విషయంలో ఈ మినీ విప్లవం 2017లో ప్రారంభమైంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనికి మద్దతు పలకడంతో మరింత ఊపందుకుంది. 15 శాతం కనీస కార్పొరేట్ ట్యాక్స్ 2023లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికా చట్టసభ సభ్యుల ప్రతిఘటన కారణంగా గడువు ముందుకు పోయే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నదనే దానితో సంబంధం లేకుండా ఎక్కడ లాభాలు గడిస్తే అక్కడ ట్యాక్స్ వేయడం ఈ సంస్కరణల్లో ప్రధానమైన అంశంగా ఉంది. దీనిపై అమెరికా కాంగ్రెస్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
భూగోళం వేడెక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు
భూగోళం వేడెక్కకుండా అర్థవంతమైన, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జి-20 దేశాల అధినేతలు ఉద్ఘాటించారు. అయితే, దానిని ఎలా సాధించాలనే విషయాన్ని మాత్రం వారు ప్రస్తావించలేదు. గ్లాస్గోలో ప్రారంభమవుతున్న వాతావరణ మార్పుల సదస్సు (సిఒపి-26) నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయిస్తుందని రోమ్ డిక్లరేషన్ పేర్కొంది. ప్రపంచ కాలుష్యంలో 80 శాతం వరకు 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ విడుదల జేస్తున్నవేనని ఆ ప్రకటన పేర్కొంది.
కరోనాపై పోరులో పరస్పర సహకారం
కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ప్రధానంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా విషయంలో అంతర్జాతీయంగా సహకారం మరింత మెరుగుపడాలని జి20 దేశాల నేతలు పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభానికి ముందు కూడా మనం రక్షణవాదం, ఏకపక్షవాదం, జాతీయవాదాన్ని ఎదుర్కొన్నామని ఇటలీ ప్రధాని మారియో డ్రాగి పేర్కొన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలకు బహుళజాతివాదమే ఉత్తమ సమాధానమని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 40 శాతం వయోజనులకు వ్కాక్సినేషన్ పూర్తి కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ.. వ్యాక్సినేషన్ విషయంలో ధనిక, పేద దేశాల మధ్య తీవ్రమైన అంతరం నెలకొనడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రష్యా అధ్యక్షులు పుతిన్ మాట్లాడుతూ వ్యాక్సిన్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపు సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనావైరస్ పరివర్తన చెందుతూనే ఉన్నందున, వ్యాక్సిన్ల క్రమబద్ధమైన, సత్వర నవీకరణ కోసం యంత్రాంగాలను అభివద్ధి చేయాలని ఆయన సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఆఫ్రికాకు హామీ ఇచ్చినట్లుగా వ్యాక్సిన్లను త్వరితగతిన సరఫరా చేయాలని, అక్కడ వ్యాక్సిన్ల ఉత్పత్తికి మద్దతు ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కోరారు.
ట్రెవి ఫౌంటెయిన్ సందర్శన
ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగుతున్న జీ20 సదస్సు రెండో రోజైన ఆదివారం భారత ప్రధాని మోడీ ఇతర ప్రపంచ నేతలతో కలిసి నగరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రెవి ఫౌంటెయిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నేతలందరూ కొంతసేపు అక్కడ ఆనందంగా గడిపారు. ఇటలీలో ఈ ఫౌంటెయిన్‌ను ఎక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతంలో అద్భుతమైన కళా ఖండాలను తీర్చిదిద్దారు. కాయిన్‌ను భుజం మీదుగా వెనక్కు ఫౌంటెయిన్లోకి ఎగురవేయడం ఇక్కడ సంప్రదాయంగా ఉంది. అలా చేస్తే రోమ్కు తిరిగి వస్తామనేది ఒక నమ్మకం. మోడీతో పాటు ఇతర నేతలు కూడా ఈ విధంగా కాయిన్ ఎగురవేసిన సందర్భానికి సంబంధించిన వీడియోను ఇటలీ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఫౌంటెయిన్ సందర్శన తర్వాత స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు.