Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మీథేన్ కాలుష్యాలను తగ్గించేందుకు ఉద్దేశించిన విస్తృత ప్రణాళికను బైడెన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రణాళిక, గ్లోబల్ వార్మింగ్‌కు గణనీయంగా దోహదపడే, కార్బన్డయాక్సైడ్ కంటే బలమైన రీతిలో స్వల్పకాలిక పంచ్‌ను ఇచ్చే శక్తివంతమైన కాలుష్యకారక వాయువును లక్ష్యంగా చేసుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సుకు రెండు రోజుల పాటు హాజరైన బైడెన్ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మంగళవారం ఈ ప్రణాళికను ప్రకటించారు. 2030నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా మీథేన్ కాలుష్యాలను 30శాతం తగ్గించేందుకు యురోపియన్ యూనియన్, ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని బైడెన్ సదస్సులో ప్రతిన చేశారు. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి మీథేన్ నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఇపిఎ) రూపొందించిన ఒప్పందంలో భాగమే అమెరికా ప్రస్తుతం తీసుకున్న చర్యలు. బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే జారీచేసిన మొదటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఒకటి ఈ మీథేన్ కాలుష్యాన్ని తగ్గించడమే. దేశవ్యాప్తంగా గల చమురు, గ్యాస్ బావుల నుండి వెలువడే మీథేన్ వాయువులను తగ్గించడాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదిత ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది. గత నిబంధనల ప్రకారమైతే కొత్త బావులపై ఈ రకమైన దృష్టి కేంద్రీకరించాలని భావించారు. క్లీన్ ఎయిర్ యాక్ట్ కింద రూపొందించిన ఈ కొత్త ప్రణాళిక 2016లో ఒబామా హయాంలో పెట్టుకున్న ప్రమాణాలకన్నా మరింత కఠినంగా వుండనుంది. పైగా మీథేన్ వాయువులను, ఇతర కాలుష్య కారకాలను గణనీయంగా తగ్గించడానికి దారితీస్తుందని ఇపిఎ అడ్మినిస్ట్రేటర్ మైఖేల్ రీగన్ చెప్పారు. కాప్ 26 సమావేశం కోసం గ్లాస్గోలో ప్రపంచ నేతలందరూ సమావేశమైన ఈ కీలక తరుణాన, సాహసోపేతమైన చర్యల ద్వారా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో అమెరికా నాయకత్వ స్థానంలో వుందని దీంతో స్పష్టమవుతోందని రీగన్ వ్యాఖ్యానించారు. ఇపిఎ తీసుకున్న ఈ చారిత్రక చర్యతో దేశవ్యాప్తంగా తీవ్రమైన స్థాయిలో శాశ్వతంగా కాలుష్యం తగ్గించబడుతుందని రీగన్ ప్రకటించారరు. ఈ కొత్త ప్రణాళిక వల్ల చమురు, గ్యాస్ బావులకు సమీపంలో నివసించే ప్రజలకు రక్షణ పెరుగుతుందని, పారిస్ ఒప్పందం కింద అమెరికా వాతావరణ లక్ష్యాలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పారు.