Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కార్యకర్తల ఆందోళన
గ్లాస్గో : వాతావరణ సదస్సు జరుగుతున్న సందర్భంగా గ్లాస్గో నగరంలో పోలీసులు మరింత తీవ్రమైన రీతిలో ఆం దోళనకారులను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ పోలీసు పర్యవేక్షక గ్రూపులు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలో ప్రదర్శనలు నిర్వహించడానికి ముందుగానే కొంతమంది కార్యకర్తలను అధికారులు గుర్తించినట్లు నెట్వర్క్ ఫర్ పోలీస్ మోనిటరింగ్ (నెట్పోల్) ఆదివారం తెలిపింది. నెట్పోల్ ప్రచార సమన్వయకర్త కెవిన్ బ్లో ఒక ప్రకటన జారీ చేస్తూ, ప్రచారకర్తలు పబ్‌లకు దూరంగా వున్నారనే సమా చారం తమ గ్రూపునకు అందిందని చెప్పారు. అలాగే, నగ రంలో ప్రతి ఒక్కరినీ ఆపి, సోదా చేసి పంపే అధికారాలను పోలీసులు అధికంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. కాప్ సదస్సు సందర్భంగా పోలీసులు తమ అధికారాలను అతిగా ఉపయోగిస్తున్నట్లు వార్తలందిన నేపథ్యంలో కార్యకర్తలు తమ హక్కుల గురించి తెలుసుకుని వుండాలని, స్కాటిష్ కమ్యూనిటీకి చెందిన లీగల్ ప్రాజెక్టు కార్యకర్త ట్విట్టర్లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్లాస్గోలో విధులు నిర్వర్తించే సమయంలో మానవ హక్కుల నిబంధనలకు కట్టుబడి వుం డాల్సిందిగా నెట్పోల్ స్కాట్లాండ్ పోలీసులను కోరింది. ఆందోళనకారులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని ముందుగా ఎన్నో హామీలిచ్చిన పోలీసులు, సదస్సు ప్రారం భమైన వెంటనే వాటినన్నింటినీ వదిలిపెట్టినట్లు కనిపిస్తోం దని బ్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల విస్తృ తంగా సోదాలు, తనిఖీలు జరుగుతున్నట్లు వార్తలు వస్తు న్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఇంటెలిజెన్స్ అధికా రులను మోహరిస్తుండడాన్ని చూస్తున్నామని అన్నారు. ఆందోళనలు జరపకపోయినా కార్యకర్తలను అనుచితమైన రీతిలో లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.
బాధితుల వాణి వినబడాలి
కాప్ 26 సమావేశం ఎలా జరగబోతుంది, ఏ ఏ నిర్ణ యాలు తీసుకోగలుగుతుందనే అంశాలపై గ్లోబల్ సిటిజన్స్ అసెంబ్లీ సభ్యులు తమనివేదికను సోమవారం అందజేశారు. కాప్ 26 సమావేశం జరగడానికి ముందుగా చర్చల క్రమం కొనసాగుతున్న సమయంలో రూపొందిన విధాన ప్రతిపాద నలను అందజేశారు. భారత్, చైనా, కాంగోలతో సహా పలు దేశాలకు చెందిన కార్మికులు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారు. వీరు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాతావరణ సదస్సులో నిర్ణయాలు తీసుకునేటపుడు అత్యంత తీవ్రంగా ప్రభావితమ య్యే ప్రజల వాణిని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు వారొక పీపుల్స్ డిక్లరేషన్‌ను అందజేశారు.
సుస్థిరాభివృద్ధి ప్రయత్నాలకు సహకరిస్తాం : మోడీ
సుస్థిరాభివృద్ధి సాధించేందుకు జరిగే ప్రయత్నాలను భారత్ ఎల్లప్పుడూ బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై పోరులో భారత్ ఒక కీలకమైన భాగస్వామి అని యూరోపియన్ యూనియన్ (ఇయు) కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్డే లేయెన్ పేర్కొన్న నేపథ్యంలో అందుకు స్పందనగా మోడీ మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన జి20 సదస్సు సందర్భంగా లేయెన్‌తో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు చార్లెక్ మిచెల్‌తో అక్టోబర్ 29న భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సందర్భంగా కూడా మోడీ, లేయెన్లు సోమవారం మరోసారి విడిగా భేటీ అయ్యారు. మోడీతో భేటీపై లేయెన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ''భారత్‌తో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడం మంచిది. ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కొవడంలో భారత్ ఒక కీలక భాగస్వామి'' అని అన్నారు. సిఓపి26 సదస్సును ఉద్దేశించి ప్రధాని మోడీ సోమవారం మాట్లాడుతూ 2070 నాటికి 'జీరో' కర్భన ఉద్గారాలను భారత్ సాధిస్తుందని హామీఇచ్చారు. పారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో నిబద్ధతగా పనిచేస్తున్న దేశం భారత్ మాత్రమే అని చెప్పారు.