Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పెగాసస్'పై మాట మార్చిన ఇజ్రాయెల్
జెరూసలేం : పెగాసస్ స్పైవేర్‌ను తయారుచేసిన 'ఎన్ఎస్ఓ గ్రూప్' ఒక ప్రయివేటు కంపెనీ, దానితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ అన్నారు. ''ఎన్ఎస్ఓ ఒక ప్రయివేటు కంపెనీ. ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదు. ఆ హోదా లేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలకి, ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. సైబర్ నేరాలపై ఇజ్రాయెల్‌లో ఉన్న కఠిన నిబంధనలు ప్రపంచంలో మరెక్కడా లేవు'' అని జెరూసలేంలో శనివారంనాటి మీడియా సమావేశంలో లాపిడ్ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రాజకీయంగా దుమారం రేపిన 'పెగాసస్ కుంభకోణం' వెనుకున్న సంస్థ 'ఎన్ఎస్ఓ గ్రూప్'. ఈ కంపెనీ తయారుచేసిన మిలటరీ గ్రేడ్ నిఘా సాఫ్ట్వేర్ 'పెగాసస్'. దాంతో ఎన్ఎస్ఓ కార్యకలాపాల్ని అమెరికా, యూరప్ దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి. ఈ స్పైవేర్‌తో భారత్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న మేధావులు, పౌర హక్కుల నేతలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులపై మోడీ సర్కార్ అక్రమ నిఘాకు పాల్పడింది. పెగాసస్‌పై వివిధ దేశాల్లో ప్రభుత్వ విచారణ కూడా సాగుతోంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ అనుమతి లభించాకే స్పైవేర్ సేవల్ని ఎన్ఎస్ఓ గ్రూప్ ఇతర దేశాలకు అందిస్తున్న సంగతి ఇజ్రాయెల్ గతంలో వెల్లడించింది. ఆ కంపెనీ వ్యవహారాలపై రక్షణ శాఖ విచారణ చేస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? పెగాసస్ కుంభకోణంపై ఏం తేల్చారు? అనేదానిపై ఇజ్రాయెల్ ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు. పెగాసస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తాజాగా మీడియాలో వెల్లడించటం ప్రాధాన్యత సంతరించుకుంది.