Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఓర్టెగా ఎన్నిక
మనగువా : నికరాగ్వాలో ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాండినిస్టా ఫ్రంట్ ఫర్ నేషనల్ లిబరేషన్ విజయం సాధించింది. అధ్యక్షుడు, కమాండర్ డేనియల్ ఓర్టెగా వరుసగా నాల్గోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల ముందునుంచీ వీటిని గుర్తించేది లేదంటూ అంతర్జాతీయంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆదివారం నికరాగ్వాలో శాంతియుతంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. శాండినిస్టా విప్లవ నేతగా, అధ్యక్షుడిగా కొనసాగేందుకు నికరాగ్వా ప్రజలు కమాండర్ డేనియల్ ఓర్టెగాకు పట్టం కట్టారు. ఆయన భార్య, రోజారియో మురిల్లో ఉపాధ్యక్షులుగా కొనసాగనున్నారు. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు చెప్పేవాటికి, నికరాగ్వాలో వాస్తవంగా నెలకొన్న పరిస్థితులకు గల అంతరాన్ని ఈ ఎన్నికలు స్పష్టంగా చెప్పాయి. 65.34 శాతం మంది ప్రజలు ఈ క్రమానికి తమ మద్దతు తెలిపారు. వారిలో 74.99 శాతం మంది ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు వేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుసాయాలు, ఆహార సార్వభౌమాధికారం, లింగ సమానత వంటి రంగాల్లో ఎఫ్ఎస్ఎల్ఎన్ నేతృత్వంలోని ప్రభుత్వం గణనీయమైన విజయాలు సాధించింది. డజనుకు పైగా దేశాల నుంచి వందలాదిమంది అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకులు ఆదివారం ఎన్నికలను పర్యవేక్షించారు. అవినీతి, అవకతవకలతో కూడి, అప్రజాస్వామిక ఎన్నికల వ్యవస్థ అంటూ అమెరికా, యురోపియన్ యూనియన్లు చేసే ఆరోపణల్లోని బూటకాన్ని తేటతెల్లం చేసేలా ఈ ఎన్నికలు ప్రశాంతంగా, నికరాగ్వా ప్రజాస్వామిక క్రమం సుస్థిరతను స్పష్టంచేసేలా జరిగాయి.