Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాప్ సదస్సులో వారిదే అగ్రభాగం
గ్లాస్గో : ఇక్కడ జరుగుతున్న వాతావరణ సదస్సుకు హాజరైన అతిపెద్ద ప్రతినిధి బృందం శిలాజ ఇంధన పరిశ్రమకి చెందిన ప్రతినిధి బృందమేనని విశ్లేషణలో వెల్లడైంది. గ్లోబల్ విట్నెస్ నేతృత్వంలోని ప్రచార కార్యకర్తలు, సదస్సులో పాల్గొన్న వారి జాబితాను సమీక్షించారు. సదస్సు ప్రారంభానికి ముందుగా ఈ జాబితాను ఐక్యరాజ్యసమితి ప్రచురించింది.శిలాజ ఇంధన ప్రయోజనాలకు సంబంధించిన వారు 503మంది సదస్సుకు హాజరైనట్లు వెల్లడైంది. చమురు,గ్యాస్ పరిశ్రమలకు లాబీయింగ్ జరిపేందుకు ఈ ప్రతినిధులు వచ్చారని,వారిని సదస్సుకు హాజరు కాకుండా నిషేధం విధించాలని ప్రచార కార్యకర్తలు డిమాండ్ చేశారు.వాతావరణ సంక్షోభంపై వాస్తవ కార్యాచరణ చేపట్టడానికి దశాబ్దాలుగా శిలాజ ఇంధన పరిశ్రమ నిరాకరిస్తూ వస్తోంది.అందువల్లే ఇది అతిపెద్ద సమస్యగా మారిందని గ్లోబల్ విట్నెస్కి చెందిన ముర్రే వర్తీ వ్యాఖ్యానించారు. 25ఏళ్లుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన వాతావరణ చర్చలు జరుగుతున్నా కాలుష్య ఉద్గారాలు పెద్ద మొత్తంలో తగ్గకపోవడానికి వీరి ప్రభావమే అతిపెద్ద కారణమని అన్నారు. కాప్ సదస్సుకు 40వేల మంది హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితి వెలువరించిన డేటా ప్రకారం బ్రెజిల్ అతిపెద్ద అధికార బృందాన్ని పంపించింది.మొత్తంగా 479మంది ప్రతినిధులతో కూడిన బృందం హాజరైంది.కెనడా, రష్యాలతో సహా 27 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల బృంద సభ్యుల్లో శిలాజ ఇంధన లాబీయిస్టులు ఉన్నారు. మొత్తమ్మీద కాప్‌లో వందకు పైగా శిలాజ ఇంధన కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో 30 వాణిజ్య సమాఖ్యలు సభ్యత్వ సంస్థలు ఉన్నాయి.