Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సముద్రపు నీళ్ళలో నిలబడి టువాలు మంత్రి ప్రసంగం
- కాప్ సదస్సుకు వీడియో
కాన్బెర్రా : వాతావరణ మార్పుల వల్ల తమ ద్వీపకల్ప దేశం పరిస్థితి ఎలా వుందో తెలియచేసేలా తువలు విదేశాంగ మంత్రి ఒక వీడియో తీసి కాప్ సదస్సుకు పంపించారు. మోకాలు లోతు సముద్రపు నీటిలో నిలబడి గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సునుద్దేశించి చేసిన ప్రసంగాన్ని తువలు విదేశాంగ మంత్రి పంపించారు. సూట్, టై ధరించి సముద్రపు నీళ్ళలో నిలబడిన తువలు విదేశాంగ మంత్రి సిమన్ కోఫె చిత్రాలు సమావేశంలో అందరి దృష్టిని ఆకర్షించాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రాలు బాగా వైరల్ అయ్యాయి. పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలపై తువలు సాగిస్తున్న పోరాటం గురించి ఈ చిత్రాలు అందరికీ తెలియచేశాయి.
వాతావరణ మార్పుల వల్ల వాస్తవ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలియచేయాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన కాప్ సదస్సుకు వీడియో సందేశం పంపారు. తువలు రాజధాని, ప్రధాన ద్వీపమైన ఫనాఫుటికి దూరంగా ప్రభుత్వ ప్రసార సంస్థ టీవీబీసీ ఈ వీడియోను రూపొందించిందని ప్రభుత్వ అధికారి తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత పరిమితం చేసేందుకు గానూ మరింత సాహసోపేతమైన చర్యలు తీసుకునేలా ప్రాంతీయ నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ వీడియోను సమావేశాల్లో ప్రదర్శించారు. 2050కల్లా జీరో కర్బన ఉద్గారాలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రధాన కాలుష్య కారక దేశాలు హామీ ఇచ్చాయి. అయితే పసిఫిక్ ద్వీపకల్పదేశాల నేతలు మాత్రం తక్షణమే కార్యాచరణ అవసరమని పట్టుబడుతున్నాయి. పల్లపు ప్రాంత దేశాలైన తమవంటి దేశాల్లో మనుగడే ప్రమాదంలో పడుతున్నదని వారు హెచ్చరిస్తున్నారు.