Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు రష్యా హెచ్చరిక
మాస్కో : ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది. ఇటీవల కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్‌కు ప్రాణాంతకమైన ఆయుధాలను అమెరికా సరఫరా చేసినట్లైతే ఆ దేశంలో అంతర్యుద్ధం మరింత పెచ్చరిల్లుతుందని, పైగా శాశ్వత ప్రాతిపదికన శాంతిని నెలకొల్పే ఒప్పందం మరింత కఠినతరమవుతుందని అమెరికాలో రష్యా రాయబారి హెచ్చరించారు. ఈ మేరకు రాయబారి అనతొలి అంటొనొవ్ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. అమెరికా, ఉక్రెయిన్ దౌత్యవేత్తలు సంతకాలు చేసిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో ప్రమాదకరమైన నినాదాలు వున్నాయని అన్నారు. దాదాపు ప్రతి వాక్యంలోనూ రష్యాను వ్యతిరేకించేలా భౌగోళిక, రాజకీయ సాధనం వుందని వ్యాఖ్యానించారు. ఆయుధాలు సరఫరా చేయాలన్న ప్రణాళికలతో ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత అధ్వానమవు తుందని హెచ్చరించారు. బుధవారం ఈ ఒప్పందంపై అమెరికా విదేశాం గ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా సంతకాలు చేశారు. వివాదాస్పదమైన క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్ ప్రాదేశిక హక్కులను గుర్తించాలన్న అమెరికా విధానానికి కట్టుబడి వుంటామని ఆ ఒప్పందం పునరుద్ఘాటించింది. రాజకీయ, భద్రతా, రక్షణ, అభివృద్ధి, ఆర్థిక, ఇంధన, శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక, మానవతా వాద రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఒప్పందం కోరుతోంది.