Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకారానికి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు
- మిథేన్, కర్బన ఉద్గారాల తగ్గించేందుకు ప్రణాళిక
- గ్లాస్గో సదస్సులో సంయుక్త డిక్లరేషన్ జారీ
గ్లాస్గో : వాతావరణ మార్పులను ఎదు ర్కొనడంపై కలిసి పనిచేయాలని చైనా, అమెరికా నిర్ణయించాయి. ఇందుకోసం ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనున్నాయి. ఈమేరకు ఇక్కడ జరుగుతున్న కాప్26 సదస్సులో చైనా, అమెరికా బుధవారం సంయుక్త డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. మిథేన్, కర్బన ఉద్గారాలను తగ్గించడం, వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయడంతో సహా పలు అంశాలు ఈ డిక్లరేషన్‌లో వున్నాయి. అంతర్జాతీయ వాతావరణ చర్యలకు సంబంధించి అమెరికా-చైనా సహకారమే ఏకైక, సరైన మార్గమని డిక్లరేషన్ నొక్కి చెప్పిందని అధికారు లు, విశ్లేషకులు పేర్కొన్నారు. పైగా కాప్26 విజయవంతమవడానికి ఇది బలమైన సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించారు. 2020ల్లో వాతావరణ చర్యలను పెంపొందించడంపై ఇరు దేశాలు కలిసి గ్లాస్గో సంయుక్త డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఇప్పటివరకు జరిగిన కృషిని ఇరు పక్షాలు అభినందించాయి. పారిస్ ఒప్పందం అమలును మరింత బలోపేతం చేసేందుకు అన్ని పక్షాలతో కలిసి పని చేయడాన్ని కొనసాగించాలని ప్రతిన చేశాయి.
ఉమ్మడి, భిన్నమైన బాధ్యతలు, సామర్ధ్యాలు ప్రాతిపదికగా, అలాగే దేశీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాతావరణ సంక్షోభాన్ని సమర్ధవంతంగా పరిష్కరించేందుకు మరింతగా చర్యలు తీసుకోవాలని ఆ డిక్లరేషన్‌లో ఇరు పక్షాలు పేర్కొన్నాయి. వాతావరణ మార్పులపై సహకా రాన్ని మరింత పెంపొందించడానికి ఇరు దేశాల మధ్య, బహుముఖ క్రమాన్ని కొనసాగించేందుకు ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసేందుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఉష్ణోగ్రతలను రెండు డిగ్రీల కన్నా తక్కువ వుంచేందుకు, 1.5డిగ్రీలకు పరిమితి చేసేందుకు పారిస్ వాతా వరణ ఒప్పందాన్ని అమలు చేయాలని పునరుద్ఘాటించాయి. ఇక మీథేన్ ఉద్గారాలను తగ్గించడంపై సహకారానికి సంబంధించి అదనపు చర్యలు తీసుకోవాలని భావించాయి. తమదేశ, రాష్ట్రాస్థాయిల్లో ఉద్గారాల నియం త్రణకు చర్యలు చేపట్టాలని భావించాయి. మీథేన్‌పై సమగ్రమైన, పటిష్ట మైన జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చైనా భావి స్తోంది. ఇక కర్బన ఉద్గారాలకు సంబంధించి సౌర విద్యుత్‌తో సహా ఇతర పరిశుద్ధమైన విద్యుత్ పరిష్కార మార్గాలను ప్రోత్సహించేలా విధానాలపై సహకరించుకోవడానికి అంగీకారం కుదిరింది. 15వ పంచవర్ష ప్రణాళికా కాలంలో బొగ్గు వినిమయాన్ని చైనా దశలవారీగా తగ్గించనుంది. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపింది.
వాతావరణ మార్పులపై ఇరు దేశాల మధ్య అభిప్రాయ బేధాల కన్నా మరింత ఎక్కువగా ఏకాభిప్రాయం నెలకొందని వాతావరణ మార్పులపై చైనా ప్రత్యేక దూత జీ ఝెన్హువా వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు కలిసి చాలా విషయాలు చక్కబెట్టవచ్చని, అవి ఆ రెండు దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి ప్రయోజనం కలిగిస్తాయని అన్నారు. చైనా, అమెరికాలు ప్రధాన బాథ్యతలను తీసుకోవాలని, అప్పుడు మిగిలిన ప్రపంచ దేశాలు అదే ధోరణిని అనుసరిస్తాయని జీ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మొదటి అర్ధ భాగంలో వర్కింగ్ గ్రూపు మొదటి సమావేశం వుంటుందని చెప్పారు.
స్వాగతించిన ఐరాస చీఫ్
రెండు అగ్రరాజ్యాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించాలంటే అంతర్జాతీయ సహకారం, సంఘీభావం అవసరమని, సరైన దిశగా సాగే కీలక చర్య ఇదని వ్యాఖ్యానించారు. ఇదొక కీలకమైన పరిణామంగా చైనా నిపుణులు కూడా భావిస్తున్నారు. లక్ష్యం 1.5 లేదా 2 డిగ్రీలా అనేది ఇక్కడ సమస్య కాదు, చైనా, అమెరికా కలిసి పనిచేయడం కీలకం. రెండు ప్రధాన దేశాలు చేపట్టే సంయుక్త కృషి ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుందని చైనా ఎనర్జీ ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ లిన్ బాకియంగా వ్యాఖ్యానించారు.