Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాప్-26 సదస్సులో అరకొర హామీలు !
- సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం
గ్లాస్గో : శిలాజ ఇంధనాలను తగ్గించడంపై సంపన్న దేశాల నుంచి అరకొర హామీలు రావడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముప్పు ముంచుకొస్తున్నా నిర్దిష్ట కార్యాచరణకు చర్యలు చేపట్టేందుకు కాలపరిమితితో కూడిన హామీలివ్వలేదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాప్ సదస్సును ఈ వారాంతం వరకు పొడిగించవచ్చని సూచనలు వెలువడుతున్నాయి. 12రోజుల పాటు చర్చలు జరిగిన అనంతరం శుక్రవారంతో గ్లాస్గో సదస్సు ముగియాల్సి వుంది. 27సభ్య దేశాలు, వంద దేశాలకు పైగా వచ్చిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే, కాలుష్యాలను తగ్గించడానికి సంబంధించి బలమైన హామీలేవీ రాలేదనే విమర్శలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలు పొడిగించాలని భావిస్తున్నారు. బుధవారం మొదటిసారిగా ప్రచురించబడిన కాప్ 26 ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్న హామీలు కూడా రాబోయే రోజుల్లో తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరించారు. శిలాజ ఇంధనాలపై నిర్దిష్టంగా హామీలు కొరవడడమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. మానవాళి మనుగడ సాగించాలంటే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగకుండా చూసుకోవడమే లక్ష్యమని, కానీ ప్రస్తుతం కాప్ సదస్సులో చమురు, బొగ్గు, గ్యాస్‌లపై ఇచ్చిన వాగ్దానాలు సరిపోవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు, గ్యాస్, బొగ్గు ఉత్పత్తి సమస్యను పూర్తిగా పరిష్కరించామా లేదా అనేదే ఈ సదస్సు విజయవంతమైందా లేదా అనడానికి ప్రామాణికమని కేంపైనింగ్ ఆర్గనైజేషన్ 350.ఓఆర్జీ పేర్కొంది. సంపన్న, శిలాజ ఇంధనాలు ఉత్పత్తి చేసే దేశాలు ముందుగా నాయకత్వ బాధ్యత తీసుకుని దశలవారీగా కార్యాచరణ చేపట్టాలని, ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిని కూడా విధించుకోవాలని ఆ గ్రూపు పిలుపిచ్చింది. నిరుపేద దేశాలు, దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ పరివర్తనా క్రమంలో చేయూతనివ్వాలని కోరింది. విపత్తును నివారించి, కార్యాచరణ చేపడితేనే ఈ కాప్ సదస్సు ఫలితాలనిచ్చిందని భావించాల్సి వస్తుందని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ బ్రిటన్ డైరెక్టర్ కేథరిన్ పెటెంగల్ వ్యాఖ్యానించారు. ఒకపక్క చమురు, గ్యాస్, బొగ్గు రంగాల్లో పెట్టుబడులను కొనసాగిస్తూ మరోప్క శిలాజ ఇంధనాలను తగ్గిస్తామని బూటకపు హామీలిస్తున్నారంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.