Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకస్: నికరాగ్వా ప్రజలపైన, డేనియల్ ఓర్టెగా నేతృత్వంలోని శాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్) ప్రభుత్వంపైన అమెరికా, దాని మిత్ర పక్షాలు ఏకపక్షంగా విధించిన ఆంక్షలను వెనిజులా, రష్యా తీవ్రంగా ఖండించాయి. నికరాగ్వాలో ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు వీలుగా ఎన్నికల సంస్కరణల చట్టం (రెనేసర్)పై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు. డొమినికన్ రిపబ్లిక్-మధ్య అమెరికా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (కాఫ్టా-డిఆర్)లో నికరాగ్వా భాగస్వామ్యాన్ని మదింపు వేసేందుకు బైడెన్‌కు అధికారమిస్తున్న రెనేసర్ చట్టానికి యూరోపియన్ యూనియన్, కెనడా వత్తాసు పలికాయి. ఈ చట్టాన్ని సాధనంగా చేసుకుని నికరాగ్వాకు బహుళ పక్ష రుణాలు అందకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయి..వాణిజ్యపరంగా, ఆర్థికపరంగా ఒత్తిళ్లు పెంచేందుకు, రాజకీయ బ్లాక్‌మెయిలింగ్ పద్ధతులకు పాల్పడేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించుకోజూస్తున్నది. అమెరికా విధించిన ఈ కొత్త ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని వెనిజులా విదేశాంగ మంత్రి ఫెలిక్స్ ప్లెసిన్సియా విమర్శించారు. ఈ రెనేసర్ చట్టాన్ని తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని అన్నారు. నికరాగ్వా ధ్రువీకరించిన నవంబరు7 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అమెరికా గౌరవించడం నేర్చుకోవాలని ఫెలిక్స్ హితవు పలికారు. నికరాగ్వా సోదరులపై అమెరికా దుందుడుకు చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెనిజులా ప్రకటించింది. నికరాగ్వాలో ఓర్టెగా నేతృత్వంలోని శాండినిస్టా ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును అది పునరుద్ఘాటించింది.