Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రాత్మక తీర్మానం ఆమోదం
బీజింగ్ : గత నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ వార్షిక (ప్లీనం ) సమావేశాలు గురువారంతో ముగిశాయి. కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతల్లో అధ్యక్షుడిగా జిన్‌పింగ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేలా, వచ్చే ఏడాది జరగనున్న పార్టీ మహాసభలకు ముందుగా ఆయన హోదాను మరింత పెంచుతూ ప్లీనం సమావేశాలు ముగిశాయి. ఈ మేరకు ప్లీనం సమావేశాల్లో గురువారం చారిత్రక తీర్మానాన్ని ఆమోదించారు. వందేళ్ల చరిత్రలో ఇలా చారిత్రక తీర్మానాన్ని ఆమోదించడం ఇది మూడోసారి మాత్రమే. ''గత శతాబ్ద కాలంలో పార్టీ సాధించిన ప్రధాన విజయాలు, చారిత్రక అనుభవాలపై తీర్మానం'' ను పార్టీ ఆమోదించిందని కేంద్ర కమిటీ (ప్లీనం) వార్షిక సమావేశానంతరం విడుదలైన ప్రకటన పేర్కొంది. జిన్‌పింగ్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన కీలక స్థానాన్ని ధృఢంగా నిలబెట్టాలంటూ పార్టీని కోరింది. వచ్చే ఏడాది పార్టీ 20వ మహాసభలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పార్టీలో జిన్‌పింగ్‌కు గల కీలక స్థానాన్ని ధృఢంగా నిలబెట్టాలని, పరిరక్షించాలని పార్టీ సభ్యులను ఆ ప్రకటన కోరింది. పార్టీ సభ్యులందరూ ఏకతాటిపై నిలబడాలని పిలుపిచ్చింది. చారిత్రకమైన రీతిలో పార్టీ ఆమోదించిన మూడవ తీర్మానం ఇది. గత రెండు సందర్భాల్లోనూ రాజకీయ దిశా నిర్దేశానికి సంబంధించి గణనీయమైన మార్పులు చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. 1945లో, మావో జెడాంగ్ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. స్టాలిన్ ప్రభావం నుండి దూరంగా వెళ్లేలా కీలకమైన రాజకీయ మలుపునకు శ్రీకారం చుడుతూ మావో తీర్మానాన్ని ఆమోదించారు. 1981లో డెంగ్ గ్జియావోపింగ్ మరో తీర్మానాన్ని ఆమోదించారు. మితిమీరిన మావోయిజం నుండి దూరంగా వెళ్లేందుకు, ఏక వ్యక్తి ఆరాధన సంస్కృతి నుండి సంస్కరణల శకానికి పయనించేలా మరో మలుపు తీసుకుంటూ చారిత్రక తీర్మానాన్ని ఆనాడు ఆమోదించారు. ఆ సంస్కరణలే చైనా అభివృద్ధికి దారి తీశాయి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశగా నడిపించాయి. ''పార్టీ చరిత్రపై హేతుబద్ధమైన దృక్పథాన్ని అనుసరించాల్సింది'' గా పార్టీ సభ్యులను ఆ ప్రకటన కోరింది. గత శతాబ్ద కాలంలో పార్టీ సాధించిన విజయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే గతంలో మనమెందుకు విజయం సాధించామో, భవిష్యత్తులో మనం ఎలా విజయాలను సాధిస్తామో తెలుస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. మావో, డెంగ్‌ల వారసత్వాన్ని, వారి సైద్ధాంతిక సేవలను ఆ ప్రకటన ప్రశంసించింది. ఐదువేలకు పైగా పదాలతో ఆంగ్లంలో జారీ అయిన ఈ ప్రకటనలో ఈ ఇరువురు నేతల పేర్లు వరుసగా ఏడు, ఐదుసార్లు ప్రస్తావనకు వచ్చాయి. జిన్‌పింగ్‌కు ముందు వున్న ఇద్దరు అధ్యక్షులు జియాంగ్ జెమిన్, హూ జింటావోలను ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. జిన్‌పింగ్ పేరును ఈ ప్రకటనలో ఏకంగా 17సార్లు ప్రస్తావించారు. ''నూతన శకం కోసం చైనా లక్షణాలతో కూడిన సోషలిజంపై జీ జిన్‌పింగ్ ఆలోచనలు'', ఆయన సిద్ధాంత భావజాలం మన కాలంలో ఉత్తమమైన చైనా సంస్కృతి, నైతిక విలువల్లో మూర్తీభవిస్తున్నాయని, చైనా సందర్భాలకు తగినట్లుగా మార్క్సిజాన్ని అనుసరించ డంలో నూతన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని'' ఆ ప్రకటన పేర్కొంది. కరోనా మహమ్మారిని, అవినీతిని ఎదుర్కొనడంలో జిన్‌పింగ్ నాయకత్వాన్ని ప్రకటన ప్రశంసించింది. మరింత సంతులనమైన ఆర్థికాభివృద్ధికి హామీ కల్పించబడిందని, మిలటరీని పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొంది. దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను పరిరక్షించేందుకు సైన్యం నిర్దిష్ట చర్యలను తీసుకుందని తెలిపింది.